యాదగిరిగుట్ట, మార్చి 29: యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఏ దుకాణం టెండర్ వేసినా వారికే దక్కాలి.. ఇతరులు వస్తే ఊరుకోరు.. నయానో భయానో వారిని లొంగదీసుకోవడం.. ప్రశ్నిస్తే బెదిరించడం ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనచరులు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిలుతోంది. యాదగిరి కొండపై వర్తక వ్యాపార సంఘంలో ముఖ్యపాత్రను పోషించే పది మంది కాంగ్రెస్ నేతల తీరుతో దేవస్థానం ఆదాయానికి ఏటా కోట్ల రూపాయల గండి పడుతోందని సమాచారం.
ఇటీవల కొండ కింద లక్ష్మీపుష్కరిణి వద్ద రెండు దుకాణాలకు జరిగిన టెండర్లో గతంతో పోలిస్తే 75 శాతం తగ్గించి కేటాయించడంతో కొండపై పెత్తనం చెలాయించే కాంగ్రెస్ ముఖ్య నాయకుల నిర్వాకం బట్టబయలైంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అండదండలతో టెండర్లో తాము ఎంత పలికితే అంతే అంటూ ఇతరులను టెండర్ల దరిదాపుల్లోకి రానివ్వకుండా అంతా తామే అన్నట్టుగా సాగుతున్నట్లు చర్చ సాగుతున్నది. కొండపై, కొండ కింద ఏ దుకాణమైనా మాకే దక్కాలన్న ప్రధాన లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వారి ఆగడాలు సజావుగా సాగేందుకు అధికారులతో పాటు కొందరు మీడియా ప్రతినిధులను మచ్చిక చేసుకున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కనుసన్నల్లోనే టెండర్ల కేటాయింపు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు షాపింగ్ చేసేందుకు గతంలో కొండపై 117 దుకాణాలు ఉండేవి. దేవస్థాన పునర్నిర్మాణం అనంతరం గత ప్రభుత్వం కొండపై దుకాణాలు ఉండొద్దని, కొండకింద ప్రత్యేకంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. దీంతో తాము జీవనోపాధి కోల్పోయామని అప్పటి ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పని చేసిన ఈవో గీత సహకారంతో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి 10 దుకాణాలకు అనుమతి ఇచ్చారు. 2022లో ప్రధానాలయం పునఃప్రారంభమైన నాటి నుంచి 117 దుకాణాలకు చెందిన వ్యాపారులు ఒకటై పది షాపులు కొనసాగిస్తున్నారు.
ఈ వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని అందరూ కలిసికట్టుగా పంచుకుంటున్నట్లు సమాచారం. మూడేండ్లకోసారి పునరుద్ధరించుకుంటూ వారే కొండపై షాపులను కొనసాగిస్తున్నారు. యాదగిరికొండ వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో 10 దుకాణాలు దేవస్థానానికి ఏడాదికి రూ.1.68 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరిన్ని షాపులను పొడిగించడంతో పాటు షాపులు సజావుగా కొనసాగేందుకు ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లిస్తున్నారనే చర్చ సాగుతున్నది. యాదగిరికొండపై వర్తక వ్యాపార సంఘంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను బద్నాం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీరు ఏది చెబితే అదే అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. వర్తక వ్యాపార సంఘంలో 10 మంది ప్రధాన అనుచరులను ఎమ్మెల్యే దింపి కొండపై, కొండకింద షాపులు ఇతరులకు దక్కకుండా చేస్తున్నట్లు పట్టణంలో చర్చ సాగుతున్నది. టెండర్ల వేస్తే భారీగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నా మిగతా టెండరుదారులను బెదిరించి రింగ్ చేసుకుని షాపులను తక్కువకు దక్కించుకోవడంతో దేవస్థానానికి ఏటా కోట్ల ఆదాయం గండి పడుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుంటే దేవస్థాన అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు.
ఎమ్మెల్యే అ నుచరులదే.. ముఖ్యపాత్ర
రాష్ట్రంలో అధికారం మనదే.. మనమం ఏం చెబితే అదే.. ఎవరితో మనకేంటి.. అంటూ కొండపై వర్తక వ్యాపారస్తుల్లో పది మంది ముఖ్య కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే దీవెనలతో కొండపై షాపులే కాదు.. దేవస్థాన పరిధిలో వేసే ప్రతి టెండర్ తమకే దక్కాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ టెండర్లో జరిగిన అవకవతకలపై చర్చ సాగుతున్నది. కొండకింద లక్ష్మీపుష్కరిణి వద్ద ప్రకటించిన జాబితాలోని 9, 10 దుకాణాలకు సంబంధించిన కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం, బనియన్లు, టవళ్ల విక్రయ హక్కుల టెండర్ నిర్వహించారు.
గతంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంకు జీఎస్టీ కాకుండా రూ. 24,54,560, బనియన్లు, టవళ్లకు జీఎస్టీ కాకుండా రూ. 15,99,999లకు టెండరుదారులు దక్కించుకున్నారు. తాజాగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంకు జీఎస్టీ కాకుండా రూ.6 లక్షలు, బనియన్లు, టవళ్లకు జీఎస్టీ కాకుండా రూ. 4.10 లక్షలు మాత్రమే పలికిందన్నారు. టెండర్‌దారులు పరస్పరం రింగ్‌గా ఏర్పడి, పోటీ లేకుండా తక్కువ మొత్తంలో టెండర్లు పొందినట్లు అనుమానం కలుగుతోంది. గతంతో పోలిస్తే దేవస్థానానికి 75 శాతం తక్కువ ఆదాయం సమకూరే విధంగా టెండర్‌ను పది మంది కాంగ్రెస్ నాయకుల కనుసన్నలోనే దక్కించుకున్నట్లు చర్చ సాగుతున్నది.
తమకు వ్యతిరేకంగా మీడియాలో వార్తలు రావొద్దని కొందరు మీడియా ప్రతినిధులకు సైతం ముడుపులు చెల్లిస్తున్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం. సాధారణంగా గతం కంటే అధిక ఆదాయం రాని టెండర్లను రద్దు చేసి తిరిగి టెండర్లను ఆహ్వానించే సంప్రదాయం ఉంది. ఒకవేళ టెండర్లకు స్పందన లేకపోతే కేవలం 20 నుంచి 25 శాతం తగ్గించి ఇవ్వాల్సి ఉండగా 75 శాతం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు, పట్టణానికి చెందిన పలువురు ఈవో భవానీ శంకర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరిస్తున్నారు.