సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 12 : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కేర్ టేకర్ ఉద్యోగ్యాన్ని అనర్హురాలికి కేటాయించారని బాధితులు గురువారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆరు గంటలపాటు ధర్నా చేశారు. మండలంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కేర్ టేకర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు అక్టోబర్ 8న దరఖాస్తులు తీసుకున్నారు. అదే నెల 23న మెరిట్ ప్రాతిపదికన 1:3 పద్ధతిలో ఇంటర్వ్యూలకు పిలిచారు. కానీ, ఆ రోజు ఇంటర్వ్యూ నిర్వహించకుండా రెండ్రోజుల తర్వాత పిలుస్తామని చెప్పి అభ్యర్థులను ఎంఈఓ శ్రీనివాస్ పంపించారు. అప్పటి నుంచి అభ్యర్థులు ఆఫీసు చుట్టూ తిరుగుతుండగా, ఎంఈఓ మాత్రం పొంతలేని సమాధానాలతో నెట్టుకొచ్చారు. కాగా, అప్పటికే కేర్ టేకర్ ఉద్యోగానికి మెరిట్ లిస్ట్‌లో ఉన్న వారిని కాదని కనీసం ఇంటర్వ్యూకు కూడా హాజరుకాని అనర్హురాలికి ఉద్యోగం కేటాయించడం జరిగింది.
ఆమెకు కేజీబీవీ ఎస్ఓ శివరంజిని గురువారం ఉదయం ఫోన్ చేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని చెప్పారు. మెరిట్ లిస్ట్‌లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులు విషయం తెలుసుకుని ఎంఈఓ కార్యాలయానికి చేరుకుని.. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో మెరిట్ లిస్ట్‌లో ఉన్న వారిని కాదని అనర్హులకు ఉద్యోగం ఎలా కేటాయిస్తారని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరుకోబోమని కార్యాలయం ఎదటు కూర్చున్నారు. ప్రతిభ ఉన్నవారిని కాదని రాజకీయ ఒత్తిళ్లతో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వద్దని వేడుకున్నారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్‌ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. కేర్ టేకర్ ఉద్యోగానికి గతంలో 1.3 ప్రకారం మెరిట్ లిస్టులో ఉన్నావారిని ఇంటర్వ్యూకు పిలిచిన మాట వాస్తమేనన్నారు. కానీ, ఎంపిక తనకు తెలియకుండానే జరిగిందని, ఆర్డర్ కాపీ వచ్చిన విషయం కూడా తనకు తెలియదని పేర్కొనడం గమనార్హం.
మాది నిరుపేద కుటుంబం. నాన్న చనిపోవడంతో అమ్మ కూలీ పనులు చేస్తూ చదివించింది. నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే చదువుకున్నాను. బీఈడీ పూర్తి చేశాను. మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కేర్ టేకర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ నా పేరే ఉంది. ఇంటర్వ్యూకు కూడా వెళ్లాను. ఇప్పుడు మెరిస్ట్ లిస్ట్‌లో లేనివారి వారికి ఉద్యోగం ఇవ్వడం అన్యాయం. నిరుద్యోగుల జీవితాలతో రాజకీయ నాయకులు ఆడుకోవద్దు.
-బర్ల స్వాతి, బాధిత యువతి