రామగిరి, ఏప్రిల్ 21: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ వార్షిక (పబ్లిక్) పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా ఈ పరీక్షల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన నిర్వాహకులు కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ‘కాసులు ఇచ్చుకో …కాపీ కొట్టుకో’ అన్న చందంగా తొలిరోజే జిల్లాలోని పలు కేంద్రాల్లో ఈ దందాకు తెరలేపారు పరీక్ష గదిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొన్నారు. గత సంవత్సరం సైతం ఇదే పరీక్షల్లో తనిఖీకి వెళ్లిన అధికారులు ఒకరికి బదులు మరొకరు ..పరీక్ష రాస్తుండగా పట్టుబడిన విషయం గమనార్హం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు పదో తరగతిలో 3170 మంది, ఇంటర్లో 5665మంది రాస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షా కేంద్రాల్లోపల విద్యార్థుల నుంచి రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్, డీఈవో, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఓపెన్ దాందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. కొన్ని స్టడీ సెంటర్ల నిర్వాహకులు పరీక్షల్లో సాయం చేస్తామని చెప్పి, ముందుగానే డబ్బు వసూలు చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు.
మామూళ్ల మత్తులో ఇన్విజిలేటర్లు..?
పరీక్షా కేంద్రంలోకి అడుగు పెట్టిన అనంతరం ప్రశ్నా పత్రం ఇవ్వగానే అభ్యర్థులు తమ జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కొ విద్యార్థి నుంచి పేపర్‌కు రూ.200 నుంచి 300 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం చెల్లిస్తేనే లోపల సహకారం అందుతుందని, లేని పక్షంలో ఇన్విజిలేటర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. మరో వైపు కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నా పట్టించుకునే వారే లేరు. హాల్ టికెట్‌ను ఫొటోలను, విద్యార్థులను సరిపోల్చాల్సిన అధికారులు నామమాత్ర తనిఖీతో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు డబ్బులు ఇస్తే వారే అభ్యర్థులను పక్కన కూర్చోబెట్టుకొని పరీక్ష రాస్తున్నారనే ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని పరీక్షా కేంద్రాలతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా పరీక్ష గదుల్లో విద్యాశాఖ ఉన్నతాధికారుల కన్నుసన్నల్లోనే ఈ దందా నడుస్తోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసి పరీక్షా కేంద్రాల వెలుపల ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు, డబ్బులిచ్చి కాపీ కొట్టే వారికి మధ్య తేడా లేకుండా పోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మా దృష్టికి రాలేదు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని సూచించాం. రెగ్యులర్ పరీక్షలకు దీటుగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండ్లకు, ఇతర అధికారులకు సూచించాం. తొలి రోజు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాం. ఈ విషయం మా దృష్టికి రాలేదు. పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులు ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. అన్ని పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఉంచడంతోపాటు తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– సత్తమ్మ, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్, ఓపెన్ స్కూల్, నల్లగొండ