నేరేడుచర్ల, ఏప్రిల్ 17 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంతటా ఉర్రూతలూగిస్తుండగా, ఇదే అదునుగా బుకీలు రెచ్చిపోతున్నారు. బెట్టింగ్ ఊబిలోకి యువతను దింపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ మాయాజూదంలో అత్యాశకు పోయినవారు అప్పుల పాలై ఆస్తులు అమ్మకుంటున్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన యువత సుమారు కోటి రూపాయల వరకు ఐపీఎల్ బెట్టింగ్‌లో పొగొట్టుకున్నట్లు తెలుస్తున్నది. నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు సుమారు రూ.40 లక్షలు నష్టపోయినట్లు ప్రచారం జరుగుతున్నది. మేళ్లచెరువు చెందిన కొందరు కోదాడ వెళ్లి బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. హుజూర్నగర్ పట్టణంలోనూ చాప కింద నీరులా వ్యాప్తిస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల్లో బెట్టింగ్ దందా సాగుతున్నది.
గ్రామాలకూ విస్తరణ
ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్‌ను స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఆధారంగా చిన్న చిన్న గ్రామాలకూ విస్తరించారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఊబిలోకి లాగుతున్నారు. లాడ్జీలు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇండ్లు, కేఫ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు అడ్డాగానూ బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. జిల్లాల వారీగా బుకీలు చక్రం తిప్పుతుండగా, పలు ప్రాంతాల్లో సబ్‌బుకీలను ఏర్పాటుచేసుకుని యువత, కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. బెట్టింగ్ పాల్గొన్న వ్యక్తి ఓడిపోయి డబ్బులు కోల్పోయినా, వడ్డీకి అప్పులు ఇచ్చి మరీ ఆడిస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు.
మ్యాచ్‌లో ప్రతి అంశాన్ని బుకీలు బెట్టింగ్‌గా మలుస్తున్నారు. ఫోర్, సిక్స్, హాఫ్ సెంచరీ, సెంచరీ అంటూ బ్యాట్స్‌మన్‌పై, బౌలింగ్‌లో ఏ ఓవర్లో ఏ బ్యాట్స్‌మన్ అవుట్ అవుతారు? అని పందేలు కాస్తున్నట్లు తెలుస్తున్నది. మ్యాచ్ స్వరూపాన్ని బట్టి ఒంటి చేత్తో ఆటను మార్చగలిగే సత్తా ఉన్న బ్యాట్స్మన్లు, బౌలర్లపై వేలల్లో బెట్టింగ్ నడుపుతున్నట్లు సమాచారం.
బెట్టింగ్ సాగుతున్నదిలా..
ఈ బెట్టింగ్ వ్యవహారంలో బుకీ, ఫంటర్‌కు మధ్య పరిచయం ఉండదు. ఆన్లైన్ ఖాతాల ద్వారా లావాదేవీలు సాగుతున్నాయి. బుకీలు ఎవరి కంటే వారికి అవకాశం ఇవ్వరు. వారి పరిధిలోని ఏజెంట్లు, నమ్మకం ఉన్న సభ్యుడు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇలా బెట్టింగ్‌కు అర్హత పొందిన వారిని ఫంటర్ అంటారు. బుకీ అకౌంట్లో కొంత డబ్బును జమ చేసిన రోజు నుంచే ఫంటర్‌కు బెట్టింగ్‌లో పాల్గొనే చాన్స్ ఇస్తారు.
మ్యాచ్ ప్రారంభమ్యే సమయానికి అరగంట ముందు ఎంత మంది ఫంటర్లు బెట్టింగ్‌కు దిగుతారో ఫోన్ చేసి బుకీకి తెలుపుతారు. గెలుపొందిన తర్వాత బుకీ మరుసటి రోజు బ్యాంక్ సమయానికి, లేదా యూపీఐల ద్వారా ఫంటర్ ఖాతాలో డబ్బు జమ చేస్తారు. ఒకవేళ ఫంటర్ ఓడిపోతే వారు కూడా అదే తరహాలో నగదు జమ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫోన్ నెంబర్లు, వాట్సాప్ బంద్ చేసి మరుసటి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆన్ చేస్తున్నారు.