‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్‌కు ఓటేసినం. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిండు గానీ… ఇంత వరకు నా రెండు లక్షలు రుణమాఫీ కాలేదు. ఇక 55.85 క్వింటాళ్ల సన్న వడ్లు అమ్మితే ఇప్పటికీ బోనస్ డబ్బులు పడలేదు. రుణమాఫీ కాలేదు. బోనస్ డబ్బు రాలేదు. అందుకే నాకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చే వరకు గాంధీభవన్ మెట్ల మీదే కూసుంట. నన్ను జైళ్లో పెట్టినా భయపడేది లేదు.
– శాలిగౌరారం మండలం అంబారిపేటకు చెందిన రైతు తోట యాదగిరి ఆవేదన ఇది.
ఇది ఒక్క యాదగిరి మనోవేదనే కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగమంతా ఇదే తరహా ఆవేదనతో కుమిలిపోతున్నారు. రైతాంగం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు చెప్తున్న మాటల్లోని డొల్లతనాన్ని అంబారిపేట రైతు తోట యాదగిరి గాంధీ భవన్ సాక్షిగా బట్టబయలు చేయడం తీవ్ర చర్చనీయంశంగా మారింది. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని కండ్లకు కట్టినట్లు చూపిన యాదగిరి తెగువను ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో అడ్డదిడ్డంగా హామీలు ఇచ్చి తర్వాత వాటికి ఎగనామాలు పెట్టడమే తమ లక్ష్యం అన్నట్లుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు రుణమాఫీ 60 శాతం దాటలేదు. బోనస్ డబ్బులు సగానికి పైగా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. రైతుభరోసా ఇప్పటికే మూడెకరాల వరకు వేసినట్లు ప్రభుత్వం చెప్తున్నా ఇందులోనూ చాలామందికి జమ కాలేదు. ఇక మిగిలిన రైతులకు సైతం ఎప్పటివరకు భరోసా డబ్బులు వేస్తారో చెప్పే నాథుడే లేడు.
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు జూలైలో రుణమాఫీని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి నిత్యం పొలాల్లో ఉండాల్సిన రైతులు అంతకుమించిన సమయాన్ని బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగడానికే వెచ్చించాల్సి వచ్చింది. అందుక్కారణం ప్రహసనంగా మారిన రుణమాఫీనే. ప్రభుత్వం ప్రకటించిన మూడు విడతల రుణమాఫీలో ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 60 శాతానికి మించలేదు. మిగతా 40శాతానికి పైగా రైతులు రుణమాఫీ కోసం గత ఆగస్టు 15 నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆగస్టు నుంచి అదిగో… ఇదిగో రుణమాఫీ అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం నవంబర్ నెలాఖరులో కొద్దిమందితో నాలుగో విడత జాబితా ప్రకటించి చేతులు దులుపుకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు విడతల రుణమాఫీలో కలిపి 3.75లక్షల మంది రైతులకే రుణమాఫీ అయ్యింది. జిల్లాలో కనీసం మొత్తం ఐదున్నర లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ఉన్నారని అంచనా. ఆ లెక్కన ఇంకా కనీసం 1.75 లక్షల మందికి పైనే రుణమాఫీ కావాల్సిన వారు ఉంటారు. రేషన్ కార్డు లేని వాళ్లు, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకు రెండు లక్షలకు మించి రుణం ఉన్నవాళ్లు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్‌పుస్తకం నెంబర్లతోపాటు పేర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో వీరిని ప్రభుత్వం పక్కన పెట్టింది. రేషన్ కార్డు లేని రెండు లక్షల లోపు రుణమాఫీ వాళ్లకు నాలుగో విడతలో ప్రకటించారు. కానీ ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాస్‌పుస్తకం, లోన్ అకౌంట్ నంబర్లలో తప్పులు లేదా పేర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో లక్ష లోపు రుణమాఫీ కానివాళ్లు కూడా ఇంకో 35 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. ఇక రెండు లక్షలకుపైగా రుణం ఉన్న రైతుల సంఖ్య లక్షన్నరకుపైగానే ఉన్నట్లు సమాచారం. వీరంతా రైతు తోట యాదగిరి మాదిరిగానే ఎదురుచూస్తున్నారు.
రైతుభరోసాగా ఎకరాకు ప్రతి సీజన్లో రూ.7,500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తూచ్ అంటూ 6 వేల ఇస్తానని ప్రకటించింది. అది కూడా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నది. గత నెల 26 నుంచి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పి ఇప్పటివరకు కేవలం మూడెకరాల వరకు ఉన్న రైతులకే జమ చేయడం గమనార్హం. ప్రభుత్వం ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తే ఉమ్మడి జిల్లా రైతులకు రూ.1,950 కోట్ల పెట్టుబడి సాయంగా అందాల్సి ఉంది. కానీ గత యాసంగిలో 5వేల చొప్పున, వానకాలంలో అసలే ఇవ్వకుండా ప్రస్తుత యాసంగిలో రూ.6వేల చొప్పున ఇస్తామని చెప్పింది. గత యాసంగిలో 5వేలు మాత్రమే ఇవ్వడం వల్ల సుమారుగా రూ.650 కోట్లను, వానకాలంలో రూ.1950 కోట్లను, ప్రస్తుతం రూ.400 కోట్లను రైతులకు ప్రభుత్వం ఎగమానం పెట్టింది. ప్రస్తుతం ఇస్తామన్న 6 వేల భరోసా డబ్బులు కూడా ఎప్పటివరకు పూర్తి చేస్తారన్నది స్పష్టత లేదు. ఇప్పటికే మూడు విడుతలుగా మూడెకరాల వరకు వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ 3 ఎకరాల్లోపు రైతుల్లోనూ 70శాతం మంది రైతులకే భరోసా డబ్బులు జమ అయినట్లు సమాచారం. చాలామంది రైతులకు ఉన్న విస్తీర్ణానికి తగ్గట్లుగా భరోసా డబ్బులు జమకాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఒక రైతుకు ఒక రెవెన్యూ గ్రామం కంటే ఎక్కువ గ్రామాల్లో భూములు ఉంటే అన్ని కలిపి వచ్చే విస్తీర్ణం సమయంలోనే భరోసా ఇస్తామంటూ మెలిక పెట్టింది. గతంలో మొత్తం విస్తీర్ణంతో సంబం ధం లేకుండా ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణం ఉన్నా… ప్రభుత్వం విడుదల చేసే విస్తీర్ణం పరిధి రాగానే రైతుబంధు డబ్బులు జమ అయ్యేది. కానీ ప్రస్తుతం రకరకాల కొర్రీలతో ఎగనామం పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం తీరు కనిపిస్తున్నది. కేసీఆర్ సర్కార్ నాటి లెక్కల ప్రకారం చేస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 26లక్షల ఎకరాలకు గానూ 11 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందాలి. కానీ వారందరికీ ఎప్పటివరకు భరోసా డబ్బులు పడతాయన్నది ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.
సన్నధాన్యం ధాన్యం విక్రయించి రెండున్నర నెలలు గడుస్తున్నా… నేటికీ సగం మంది రైతులు తమకు రావాల్సిన బోనస్ కోసం ఎదరుచూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇదిగో.. అదిగో అంటుండడంతో నిత్యం రైతులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 10 వేల మందికి పైగా రైతులకు రూ.47.86 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంపై నమ్మకం లేకనే… బోనస్ వద్దనుకునే ఉమ్మడి జిల్లా రైతులు సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకే విక్రయించారు. చివర్లో కొంత మంది రైతులు మాత్రంప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను అమ్మారు. నల్లగొండ జిల్లాలో మొత్తం రూ.172.59కోట్ల విలువైన 74,393 మెట్రిక్ టన్నుల సన్నాలను 15,879 మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో నేటికీ 37,186 మెట్రిక్ టన్నులకు సంబంధించి 8110 మంది రైతులకు రూ.37.60 కోట్ల బోనస్ పడాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో 1.18లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలను కొనుగోలు చేయగా వీటికి సంబంధించి రూ.59కోట్ల రూపాయల బోనస్ రైతులకు చెల్లించాల్సి ఉండగా నేటికీ రూ.29 కోట్ల బోనస్ పెండింగ్‌లోనే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు చేసిందే చాలా తక్కువ. 1,171 మంది రైతుల నుంచి 4,647 మెట్రిక్ టన్నుల సన్నాలనే కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి నేటికీ రూ.2.32 లక్షల బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సాక్షాత్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకే నేటికీ సన్నధాన్యం బోనస్ డబ్బులు పడకపోతే ఇతర జిల్లాల రైతుల పరిస్థితి ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.