– ఆరుగురు నిందితులు అరెస్ట్
– వెయ్య లీటర్ల డీజిల్, రెండు డీసీఎంలు, ఆరు మొబైల్ ఫోన్లు, వడ్ల పట్టాలు స్వాధీనం
– కేసు వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ జి.రమేశ్
రామగిరి, ఏప్రిల్ 11 : అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1000 లీటర్ల డీజిల్, రెండు DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ్ల పట్టాలు (సుమారు రూ.40 లక్షల విలువ) ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ముడావత్ గాంధీ నాయక్(36), ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్(45), బనావత్ తుల్స్య నాయక్(21), ముడావత్ బాలకృష్ణ నాయక్(32), రామవత్ వాగ్య నాయక్(45), మరో మైనర్ బాలుడి గుర్తించారు. వీరంతా ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన వారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా డీజిల్ దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
కేసు వివరాలను నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ జి.రమేశ్ శనివారం వెల్లడించారు. నల్లగొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు, ఇతర హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాల నుండి వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైవేలు, అనుమానాస్పద ప్రాంతాల్లో గస్తీ పెంచడం జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 10న రాత్రి సమయంలో చిట్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై అనుమానాస్పదంగా నిలిచి ఉన్న ఓ డీసీఎం వాహనాన్ని గమనించారు. తనిఖీ చేయగా వడ్ల పట్టాల చాటున డీజిల్ తో నిండిన క్యాన్లు దాచి పెట్టినట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ బాలకృష్ణ, ఇతరులను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా హైవేపై ఆగి ఉన్న లారీల నుండి డీజిల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.
అలాగే తమ ముఠాకు చెందిన మరికొంత మంది సభ్యులు మరో డీసీఎం వాహనంతో కొంత దూరంలో ఉన్నట్లు సమాచారం ఇవ్వగా దీనిపై వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి రెండో డీసీఎం వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దానిలో మిగతా డీజిల్, మొత్తం ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. డీజిల్ దొంగల ముఠాను నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన నల్లగొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్లు ఎమ్.జితేంధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిట్యాల సీఐ నాగరాజు, చిట్యాల ఎస్.ఐ రవి కుమార్, సిసిఎస్ ఎస్ఐలు విజయ్ కుమార్, మధు, సతీష్ వర్మ, సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీను, కానిస్టేబుల్స్, అస్రర్, దస్తాగిరి, సాయికుమార్, జూనేద్, శివరాజు, నరేశ్, సిసిఎస్ ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.