దేవరకొండ రూరల్, అక్టోబర్ 27 : ప్రభుత్వ విద్యా సంస్థలైన గురుకుల, మోడల్ స్కూల్స్, కేజిబీవీల్లో ప్రయోగ పరీక్ష కేంద్రాలను తొలగించడంపై ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గురుకుల టీచర్స్ హక్కుల ఐక్యవేదిక స్టేట్ ప్రెసిడెంట్ కొండ్రపల్లి శ్రీను సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రయోగ పరీక్షల కోసం సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హాజరు కావాలని తెలియజేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు సెల్ఫ్ సెంటర్లను అనుమతించక పోవడం ప్రభుత్వ విద్యా సంస్థల ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందన్నారు. సరైన వసతులు లేని ప్రైవేట్ కేంద్రాలకు అనుమతి ఇచ్చి, మెరుగైన మౌలిక వసతులను కలిగి ఉన్న ఆయా ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రయోగ పరీక్షల కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ విద్యా సంస్థలపై వివక్ష చూపడమే అవుతందన్నారు. వీటి కోసం ప్రత్యేకమైన రవాణా సదుపాయం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. కావున గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూల్స్లో ప్రయోగ పరీక్ష కేంద్రాల తొలగింపుపై ఇంటర్ బోర్డు పునరాలోచన చేసి వెంటనే ఆయా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రయోగ పరీక్ష కేంద్రాలకు అవకాశం ఇవ్వాలని కోరారు.