నీలగిరి, మే 20: నల్లగొండ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోళ్లలో, సేకరణలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి కొన్ని కేంద్రాల్లో ధాన్య సేకరణలో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఆధారాలతో సహా అందజేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కనగల్ మండలం జి.యడవల్లిలోని ధాన్యం కేంద్రంలో రెండు రకాల ట్రక్ షీట్లతో రైతులను మోసగిస్తున్నారన్నారు. రైతులకు ఇచ్చే ట్రక్ షీట్లో ఒక రకమైన తూకం, మిల్లరు వద్ద నుంచి మరో రకమైన తూకంతో ట్రక్ షీట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. తిప్పర్తి మండలం మర్రిగూడెం, తిప్పర్తి, ఇండ్లూరు, మామిడాల తదితర ధాన్యం సేకరణ కేంద్రాలకు, బయట రాష్ట్రం నుంచి ధాన్యం వస్తోందని, స్థానికంగా ఉన్న నాయకులు, నిర్వాహకులతో కుమ్మకై ఆ ధాన్యాన్ని కొంటున్నారని తెలిపారు.
దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఆధారాలతో బయటపెట్టినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. నల్లగొండ మండలం అన్నెపర్తి ధాన్యం కేంద్రాల్లో ఇంతవరకు 25శాతం కొనుగోళ్లు కూడా జరగలేదన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని, ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ మేక అరవింద్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఎలుక శ్రీనివాస్ రెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, పెరిక కరుణ్ జయరాజ్, పలు గ్రామాల రైతులు ఉన్నారు.