చండూరు, మే 26 : ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన తెలుగు సాహిత్య పరిశోధకుడు, అధ్యాపకుడు డా.ఇడికోజు శ్రీనివాసాచారి మంగళవారం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన రచయితలు, కవులు, పరిశోధకులు, సాహిత్యాభిమానుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతీయ సాహిత్య చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ముఖ్యంగా రచయితల జీవిత విశేషాలు, రచనలు, సాహిత్య పత్రికలు, సాహిత్య సంస్థలు, సాహిత్య ఉద్యమాలు, పరిశోధనలు తదితర అంశాలను నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. సాహిత్య రంగంలో సేవలందించిన పలువురు రచయితల వివరాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఆధారాలతో భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. రచయితలు, కవులు తమ వివరాలతో పాటు తమకు తెలిసిన ఇతర రచయితల సమాచారాన్ని కూడా అందించి ఈ సాహిత్య చరిత్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. సమాచారం అందించడానికి ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు డా. ఇడికోజు శ్రీనివాసాచారిని 9885349305 నంబర్లో సంప్రదించాలని సూచించారు.