నేరేడుచర్ల, జూన్ 26 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ అన్నారు. బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, కనీసం ఆడపిల్లలు వాడుకునే బాత్రూంలకు డోర్లు కూడా సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, పాఠశాలలు ప్రారంభించి సుమారు 20 రోజులు అవుతున్నా ఇంకా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించలేదన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధన్యాత ఇచ్చి పాఠశాలల్లో మన ఊరు – మనబడి పథకం కింద నిధులు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను తుంగలో తొక్కేందుకు చూస్తుందన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాపోలు నవీన్‌కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెపంగు నాగరాజు, జిల్లా నాయకులు ఇంజమూరి రాజేశ్, పెరమళ్ల సతీశ్, జింకల భాస్కర్, భార్గవ్ చారి, గోల్కొండ వెంకటేశ్, ఇరుగు సుమంత్, విజయ్ కుమార్, పర్వతం చంద్రగిరి, రవి, మధు, శేఖర్, సతీశ్, నరేందర్ పాల్గొన్నారు.