– ఆటో, స్కూటీ, రెండు సెల్ఫోన్లు, రూ.3 వేల నగదు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి
నీలగిరి, మార్చి 21: నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దేవాలయ హుండీల దొంగతనం, అలాగే ఆటో, స్కూటీ, సెల్ ఫోన్లు అపహరించే వ్యక్తిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి స్కూటీ, ఆటో, రెండు సెల్ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే రాడ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక టూటౌన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో కేసు వివరాలు ఆయన వెల్లడించారు. ఈ నెల 19న ఉగాది పండుగ రోజున రామగిరికి చెందిన మాతంగి సాయినాధ్ అయ్యప్ప గుడిలో హుండీ, తన స్కూటీ మరియు రెండు సెల్ ఫోన్లు దొంగిలించినట్లు ఫిర్యాదు చేశాడు. అదే రోజు వైకుంఠనగర్లో ఒక ఆటో, ఆర్టీసీ కాలనీలోని శ్రీకృష్ణ ఆలయంలో హుండీ దొంగతనం జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో నల్లగొండ టూటౌన్ పోలీసులు సవాల్ గా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
శనివారం ఉదయం సావర్కర్ నగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఆటోలో దేవుడి హుండీ తీసుకుని అనుమానస్పదంగా వెళ్తుంటే పట్టుకోవడంతో పొంతన లేని లేని సమాదానాలు చెప్పాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిందితుడిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌లోని చింతల్ ప్రాంత పరిధిలోని భగత్‌నగర్‌కు చెందిన పోలిశెట్టి కార్తీక్ కుమార స్వామి @ కార్తీక్ @ కార్తీక్ కుమార్ @ కుమార స్వామి పాత నేరస్తుడిగా గుర్తించాం. విచారణ చేయగా తానే అపహరించినట్లు తెలిపాడు. ఇతడిపై నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్, సంగారెడ్డి, జీడిమెట్ల, ఖమ్మం, మహబూబాబాద్, గుంటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఇండ్లు, దేవాలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 10కి పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మూడు సార్లు జైలుకి వెళ్లి ఏడాదిన్నర శిక్ష అనుభవించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవ రావు, టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు, సిబ్బంది అహ్మద్ షరీఫ్, సాగర్ల శంకర్, బాలకోటి, సట్టు సతీశ్, ఫరూక్, సతీశ్, ప్రదీప్, హోంగార్డ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.