కోదాడ, జూలై 15 : ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు అన్నారు. మంగళవారం కోదాడ శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య, వైద్య, రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్ రికార్డు స్థాయిలో అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన తాను సొంత ప్రాంతంపై మమకారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి జ్ఞాపకాలు తనకెప్పుడూ మధుర స్మృతులేనన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇతర దేశాల ఎదుట భారత్ చేయి చాచాల్సిన దుస్థితి ఉండేదని, అయితే ఇప్పుడు బీజేపీ పాలనలో మనమే ఇతర దేశాలకు అన్ని రంగాల్లో సాయం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో దేశంలోని 140 కోట్ల మందికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేయడమే కాక ప్రపంచంలోని 150 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ ని పంపిణీ చేసిన చరిత్ర మనకుందన్నారు. రక్షణ రంగంలో స్వావలంభన సంపాదిస్తూనే ఇతర దేశాలకు సరఫరా చేసే స్థాయికి మన దేశం ఎదిగిందంటే అందుకు బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. బీజేపీ నేతృత్వంలో 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ధన ప్రవాహం నిలువరించబడితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ఈ అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, పాండురంగారావుతో పాటు పలు అసోసియేషన్ల బాధ్యులు రామచందర్రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాస్తి సుబ్బారావు, బీజేపీ నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, చల్లా శ్రీలత రెడ్డిచ అక్కిరాజు యశ్వంత్, వెంకటరామయ్య, జుట్టుకుండ సత్యనారాయణ, నూనె సులోచన, కనగాల నారాయణ, నాగాచారి, డాక్టర్ రంగాచారి, డాక్టర్ రాఘవరావు, బొలిశెట్టి కృష్ణయ్య, కిట్టు, న్యాయవాది ఎస్ ఆర్ కె మూర్తి, మేకల వెంకట్రావు, నీల సత్యనారాయణ, పందిరి నాగిరెడ్డి, ఎం.సైదేశ్వరరావు, చెన్నకేశవరావు పాల్గొన్నారు.
కోదాడ నియోజకవర్గ సర్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రామచందర్రావును మేళతాళాలతో స్వాగతం పలికారు. సంఘం బాధ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు తుంగతుర్తి శేషగిరిరావు, సింగయ్య, సుబ్రహ్మణ్య శర్మ, నాగయ్య, సంగమేశ్వర ప్రసాద్, విద్యాసాగర్‌రావు, కొమరగిరి రంగారావు, కొండపల్లి వాసు, మహంకాళి పండు, నాగయ్య. సంఘం నాయకులు పాల్గొన్నారు.
Kodada : ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భారత ప్రతిష్ఠ : ఎన్.రామచందర్‌రావు