నల్లగొండ ప్రతినిధి, మే8(నమస్తే తెలంగాణ) : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగింది. ఉగ్రవాదాన్ని భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం దాడి విషయం తెలిసిన ప్రజలు సంతోషంలో మునిగితేలారు. పాకిస్థాన్‌లోని కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసిన ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నావీ బలగాలను ఉమ్మడి జిల్లా యావత్ ప్రజానీకం అభినందనలతో ముంచెత్తుతున్నది.
ఈ రెండు రోజులుగా ఎక్క డా చూసినా… ఏ ఇద్దరూ కలిసినా.. ఆపరేషన్ సింధూర్‌పైనే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. భవిష్యత్తులోనూ పాకిస్థాన్, అది ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం భారత్ వైపు కన్నెత్తి చూసేందుకు వణుకుపుట్టేలా భారత్ చర్యలు ఉండాలని, ఆ దిశగా ప్రజలందరి మద్దతు ఉంటుందన్న సంఘీభావం సర్వత్రా వ్యక్తమవుతున్నది. భారత సైన్యం ప్రతిభాపాటవాలు, సత్తా, అత్యాధునిక రక్షణ వ్యవస్థ పట్ల ప్రతి ఇంటా చర్చ జరుగుతున్నది.
ప్రధాన మీడియా స్రవంతితోపాటు సోషల్‌మీడియా మొత్తం పాకిస్థాన్ ఉగ్రమూలలపై భారత్ సైన్యం చేసిన మెరుపు దాడుల వార్తలతోనే నిండిపోయింది. కులమతాలు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారత్ సైనిక దాడులను కీర్తిస్తూ సోషల్‌మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటూ, సంబంధిత వీడియోలను, వార్తలను షేర్లమీద షేర్లు చేస్తూ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ను జీర్ణించుకోలేని పాకిస్థాన్ ప్రతీకార దాడులతో సైన్యం కవ్వింపు చర్యలకు భారత్ ఆర్మీ దీటుగా బదులివ్వడం, దానికి అనుగుణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న సంకేతాలు సోషల్‌మీడియా వేదికగా జనం నుంచి లభిస్తున్న సంఘీభావం విశేషంగా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడుల అనంతరం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, దానికి మద్దతునిస్తున్న పాకిస్థాన్ తీరుపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా రగిలిపోతున్నారు. ఆహ్లాదం కోసం ఏ పాపం తెల్వని పర్యాటకులు స్వేచ్ఛగా విహరిస్తుండగా కాల్పులు జరిపి 26 మందిన పొట్టన పెట్టుకోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. దీంతో తప్పకుండా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పి తీరాల్సిందేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమైంది. పార్టీలకు అతీతంగా ఈ విషయంలో భారత్ ప్రభుత్వానికి మద్దతు లభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగానూ ఫహల్గామ్ దాడులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ వాడవాడలా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఇందులో కదం తొక్కారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు, దాని ఉగ్రవాద చర్యలకు చెక్ పెట్టాల్సిందేనన్న బలమైన వాదన వ్యక్తమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దుశ్చర్యలకు దీటుగా బదులివ్వాల్సిందేనని ముక్తకంఠంగా జనం నినదించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చలు జరుపుతూనే వ్యూహ్మాత్మకంగా పాకిస్థాన్‌పై దాడులకు తెరలేపింది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గురితప్పకుండా దాడులు జరపడం, నిర్దేంచుకున్న లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల భారత్ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్‌పై హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
గురువారం రాజపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్‌కు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. కోదాడలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అసమాన్యమైనదని, త్రివిధ దళాల సాహాసాలకు భారత్ దేశం యావత్తు గర్విస్తుందన్నారు. పాకిస్థాన్‌పై దాడులు విజయవంతం అవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక నకిరేకల్‌లో ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ త్రిపాఠీ, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఇక పలుచోట్ల అపార్ట్మెంట్లల్లోనూ, పలు సంస్థల్లోనూ ఆపరేషన్ సింధూర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు జరిపారు.
పాకిస్థాన్‌కు బుద్ది చెప్పి తీరాల్సిందేనని, దాని ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు భారత్ ఆపరేషన్ కొనసాగాల్సిందేనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఆర్మీ రిటైర్డ్ అధికారులు, మాజీ సైనికులు, ప్రస్తుత ఆర్మీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన వ్యూహాత్మక ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. భారత్ సైన్యానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం యావత్తు ఒక్కటిగా సంఘీభావం ప్రకటించడం దేశ సమైఖ్యతకు, సమగ్రతకు నిదర్శనమని సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.