యాదాద్రి భువనగిరి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ప్రజలందరికీ సంక్షేమంతోపాటు సామాజిక న్యాయం చేస్తామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని చైర్మన్ ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 46,689 కోట్లు సమకూర్చిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు మహిళలతో విద్యుత్ ప్లాంట్లు, మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళాశక్తి క్యాంటీన్లు తదితర కార్యక్రమాలతో మహిళలకు అండదండలు అందిస్తున్నామన్నారు. రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 23,367 కొత్త కార్డులు ఇచ్చామని, దీని ద్వారా 71, 530 మందికి లబ్ధి చేకూరిందని పేరొన్నారు.
కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని సుఖేందర్ రెడ్డి అన్నారు. శాశ్వత హకుల సాధనలో విజయం సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతిలో ఉందని, దీని కింద ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు, 50 చెరువులను నింపడానికి వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో పథకాలపై శకటాలను ప్రదర్శించారు. చివరగా స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్ యాదవ్, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాసర్ రావు తదితరులు పాల్గొన్నారు.