రామగిరి, నవంబర్ 1: ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (బోధన రుసుం), ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 3 నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు తరగతులు నిర్వహించబోమని తేల్చి చెప్పాయి. అప్పుల ఊబిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆయా వర్సిటీల అధిపతులకు బంద్ నోటీసులు అందజేశాయి.
‘ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుంటే అధ్యాపకుల జీతాలను ఎలా చెల్లించాలి? కళాశాలల అవసరాలు ఎలా తీర్చాలి? అని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పైనే ఆధారపడి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేస్తున్నాయి. దీనికయ్యే ఖర్చులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలే భరిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల విషయంలో సర్కార్ జాప్యం చేయడంతో అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుం, బిల్డింగ్ ట్యాక్స్ చెల్లించేందుకు యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పాత అప్పుల వడ్డీలు చెల్లించలేక, కొత్త అప్పులు తేలేక, అధ్యాపకులు, భవన యాజమాన్యాలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులకు గురవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రూ.380 కోట్ల బకాయిలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలలకు గత నాలుగు సంవత్సరాలుగా రూ. 380 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం నుంచి దశలవారీగా ఆందోళనలు చేపట్టడంతో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ ఇంతవరకూ స్పందించడం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ప్రభుత్వం తక్షణమే ప్రైవేట్ కళాశాలలకు పెండింగ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో అధ్యాపకుల జీతాలు, బిల్డింగ్ అద్దెలు, వివిధ రకాల ఫీజులు, ట్యాక్స్‌లు అప్పు చేసి చెల్లిస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా కళాశాలల యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. అసోసియేషన్ నిర్ణయంలో భాగంగా ఎంజీయూ ప్రైవేట్ బీఈడీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు అందజేశాం. ఈ నెల 3 నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాం. సమస్యలు పరిష్కరించే వరకు కళాశాలలు తెరిచేదిలేదు.
3 నుంచి బంద్
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా అందజేసి, ప్రతి సంవత్సరం బకాయిల్లేకుండా చెల్లిస్తామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. గత సంవత్సరం నుంచి వివిధ దశల్లో నిరవధిక బంద్‌తో పాటు నిరసనలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోసారి బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల అసోసియేషన్ నిర్ణయం మేరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు బంద్ నోటీసులను ఇప్పటికే సంబంధిత అధికారులు అందజేశాయి.
ఎంజీయూ రిజిస్ట్రార్‌కు వినతులు
రామగిరి, నవంబర్ 1: ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా చెలించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదలలో తీవ్రజాప్యం నిరసిస్తూ ఈ నెల 3 నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు తెలంగాణ అప్లీయేటెడ్ డిగ్రీ అండ్ ఫీజీ కళాశాలల మేనేజ్మెంట్, ఎంజీయూ ప్రైవేట్ బీఈడీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వేర్వేరుగా శనివారం ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. టీపీడీపీఎంఏ ఎంజీ యూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బీఈడీ కళాశాల యజమాన్యాలు సయ్యద్ జఫర్, పెద్దయ్య, హైమద్హుస్సేన్ పాల్గొన్నారు.