సూర్యాపేట, మార్చి 9 : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుధల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు చింతలపాటి చిన్న శ్రీరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ చేయకుండా, రిజర్వేషన్లు కేటాయించకుండా ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయడంతో మాదిగ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతే ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలని, అప్పటివరకు ఫలితాల విడుదలను నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతకుల రాజయ్య, బోడ శ్రీరాములు, చింత వినయ్ బాబు, వల్దాస్ జానీ పాల్గొన్నారు.