యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) :కులవృత్తులను ప్రోత్సహించేందుకు చేప పిల్లల లాంటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేసి చెరువుల్లో వదలి మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అం దులో భాగంగానే ఈ ఏడాది కూడా జిల్లాలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులను ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతో చెరువుల ఏరియాను అప్డేట్ చేశారు. ఇరిగేషన్ వాళ్లతో సమన్వయం చేసుకొంటూ ముందుకెళ్తున్నారు. రూట్ మ్యాప్ తయారు చేసి, ఏయే మండలానికి ఎంత అనేది నిర్ణయించనున్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పక్కా ప్లాన్‌తో మత్స్యశాఖ స్టాఫ్‌తో స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.
జిల్లాలో చేప పిల్లలను చెరువుల్లోకి వదలాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 161 పెద్ద చెరువులు, 954 చిన్న చెరువులు ఉన్నాయి. చేప పిల్లల విడుదలకు జిల్లా వ్యాప్తంగా 790చెరువులను ఎంపిక చేశారు. వీటిలో 3.10 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. గతేడాది కూడా 3 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలారు. చేప పిల్లల కోసం సర్కారుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను అధికారులు కొన్నారు. సుమారు 3 కోట్లతో సీడ్‌ను కొనుగోలు చేశారు. 35ఎంఎం నుంచి 40 ఎంఎం పరిమాణం ఉన్న 1.91.27కోట్ల చేప పిల్లలను సర్కారు చెరువుల్లో వేయనుంది. వీటిలో ఒక్కో చేప పిల్లకు 65 పైసలకు కొనుగోలు చేస్తుంది. ఇక 80 నుంచి 100 ఎంఎం వరకు ఉన్న 1.15 కోట్ల చేప పిల్లలను తటాకాల్లోకి వదలనుంది. వీటిని ఒక్కోటి రూ. 1.62 కొనుగోలు చేస్తుంది.
సర్కారు ఉచిత చేపల పిల్లల పంపిణీతో ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది. జిల్లాలో 142 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, 10 మహిళా మత్య్సపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ద్వారా 8,929 మంది మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు. వీరే కాకుండా సభ్యత్వాలు లేని వారు, పరోక్షంగా మరికొందరికీ ఉపాధి లభిస్తున్నది. చేప పిల్లలు పెరిగాక వలలు వేసి.. అమ్మకాలు జరపనున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా సర్కారే ఉచితంగా చేప పిల్లలను అందించనుండటంపై మత్స్యకార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల ఒట్టిపోయేవి. చెరువుల్లో నీరు లేపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి లభించకపోయేది. కొందరు వలసలు పోగా.. మరికొందరు ఇతర పనులు చేసుకునేవారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 900 చెరువులను బాగుచేసింది. ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే రూ.105 కోట్లతో 300 చెరువులను పునరుద్ధరించారు. దాంతో చెరువులు కాలంతో సంబ ంధం లేకుండా నీటితో కళకళలాడుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జళకళను సంతరించుకున్నాయి.
ఉచిత చేప పిల్లలను అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వాహనాలతో పాటు ఇతర ఉపకరణాలను అందిస్తున్నది. సమీకృత అభివృద్ధి పథకం ద్వారా 75 శాతం సబ్సిడీతో 20 రకాల యూనిట్లు పంపిణీ చేసింది. ద్విచక్ర వాహనాలతో చేపల అమ్మకం, వలలు, క్రెట్లు, లగేజీ ఆటో మొబైల్ ఫిష్ ఔట్లెట్లు తదితర యూనిట్లను అం దిం చింది. అలాగే మత్స్యకారులకు బ్యాంక్ రుణాలు ఇచ్చింది. మంచినీటి చేప హెచరీస్, చేప ల పెంపకానికి పాండ్స్, రీ సర్క్యులేటర్ ఆక్వాకల్చర్ సిస్టం, కేజ్ కల్చర్, ఇన్సులేటెడ్ వాహనాల సరఫరా, ట్రైసైకిల్ సరఫరా, చిన్నతరహా చేప దా ణా మిల్లుల ఏర్పాటు, మత్య్స విక్రయ ఏర్పాట్లు, చేపల పెంపకానికి ఇన్పుట్స్ ఇస్తున్నది.