నేరేడుచర్ల, జూన్ 15 : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత విద్యార్థులకు పుస్తకాలు అందజేయాల్సి ఉండగా పూర్తి స్థాయిలో అందించలేదు. ఇప్పటి వరకు 70 శాతం మంది విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులోకి రాగా 30 శాతం మంది విద్యార్థులు పాఠ్య పుస్తకాలు చేరలేదు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 249 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటికి 94,959 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా 62,426 మాత్రమే వచ్చాయి. ఇంకా 32,533 రావాల్సి ఉన్నవి.
హుజూర్నగర్ నియోజకవర్గంలో మొత్తం 247 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటికి సంబంధించి 94,959 పాఠ్య పుస్తకాలు అవసరం ఉన్నదని అధికారులు నివేదిక పంపినప్పటికీ విద్యార్థులకు సరిపడా పుస్తకాలను పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అధికారులు పంపించిన లెక్కలకు అనుగుణంగా పుస్తకాలను పంపించకుండా గతేడాది పాఠశాలలో హాజరు శాతానికి అనుగుణంగా పుస్తకాలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పాఠశాలలకు 65 శాతం పాఠ్య పుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. మిగిలిన పాఠ్య పుస్తకాలు ఎప్పుడు వస్తాయో, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధిస్తారోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ అవసరమైన పాఠ్య పుస్తకాల వివరాలను జిల్లా విద్యా శాఖకు పంపాం. ప్రస్తుతం మొదటి విడుతలో 70 శాతం పాఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. మిగిలిన 30 శాతం పాఠ్య పుస్తకాలు త్వరలో వస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠ్యంశాలను బోధిస్తాం.
– చత్రూనాయక్, ఎంఈఓ, నేరేడుచర్ల