– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ రూరల్, మార్చి 27 : ఈ అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామం అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ మండలం ఎద్దంపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్ధకం అవుతుందన్నారు. సీతారాముల అనుగ్రహంతో సర్వదోషాలు తొలగిపోతాయన్నారు. సీతారాముల జీవితం ఆదర్శప్రాయమైందని అన్నారు. నిజాయితీ, సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. శ్రీ రామచంద్రస్వామి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. సత్యమార్గాన్ని అనుసరిస్తూ తండ్రి ఆదేశాన్ని పాటించిన రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు.
పద్నాలుగేండ్ల పాటు అడవుల్లో ఉన్న తర్వాత అయోధ్య చేరుకున్నాడు. అప్పుడు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తులు భావిస్తారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది కూడా ఇదే రోజే కావడం విశేషం. అందుకే శ్రీరామ నవమి నాడు ఎంతో వైభవంగా సీతారాముల కల్యాణం జరుపుతారు. భక్తులకు పానకం, వడపప్పు పంచిపెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, మాల్ రెడ్డి అనిత రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నూతగంటి రఘు, పేర్ల యాదయ్య, కొమ్ము ఉదయ్ పాల్గొన్నారు.