యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) :ఎన్నికల సంగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విపక్షాలకు అందనంత స్పీడ్‌తో దూసుకుపోతున్నది. ఆ పార్టీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేమకమవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కేడర్ సైతం బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భువనగిరి సభ కేడర్‌లో ఫుల్ జోష్ నింపగా.. గురువారం మునుగోడు, ఈ నెల 29న ఆలేరులో నిర్వహించనున్న సీఎం సభలకు సబ్బండ వర్గాల ప్రజలకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్కు జనంలో ఉన్న ఆదరణను, అభ్యర్థుల ప్రచార హోరును తట్టుకోలేక విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆయా పార్టీలు ఇంకా అభ్యర్థుల ప్రకటన దగ్గరే ఆగిపోవడం గమనార్హం.
జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డితోపాటు డీసీసీడీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో చేరికలు జరుగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో ఆయన సతీమణి వనిత, కుమార్తె మన్వితా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు కలిసి ఒక్కోరోజు ఒక్కో మండలంలో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ మోత్కూరు, అడ్డగూడూరు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేటలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమాలు చేపడుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, ధరణి, రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మి తదితర ముఖ్య పథకాలను తెలియజేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం జలాలు తదితర అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కూడా స్పష్టంగా చెబుతున్నారు. అధికారంలోకి రాగానే రైతు బీమా రూ.16వేలు, ఆసరా పింఛన్ల పెంపు, కేసీఆర్ ధీమా, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు నెలకు రూ. రూ.3వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలను తెలియజేస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ వల్ల కలిగే నష్టాలు, కష్టాలను విడమరిచి చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల భువనగిరి పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగించారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గురువారం మునుగోడు నియోజకవర్గంలో మరో సభ జరుగనున్నది. ఈ నెల 29న ఆలేరు పట్టణంలో సభను నిర్వహించనున్నారు. ఇలా వరుస సభలతో కేడర్‌లో మరింత ఉత్సాహం రానున్నది. ప్రజలు సైతం గులాబీ పార్టీకే జై కొడుతున్నారు. ‘సారే కావాలి.. సారే రావాలి’ అని నినదిస్తున్నారు.
జెట్ స్పీడ్‌తో గులాబీ దళం ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులు తేలక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. బీజేపీ మొదటి విడుత జాబితాలో ఆలేరు నియోజవర్గం పేరే లేదు. దీంతో ఆ పార్టీ కనీసం ఎవరికి ఓటు వేయాలో చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను రెండు నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.