హాలియా, డిసెంబర్ 18 : హాలియా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 5.80 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. దాంతో పట్టణం పరిశుభ్రంగా మారుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు దఫాలుగా నిధులు
హాలియా మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేసింది. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు విన్నవించగా ఆయన స్పందించి ప్రత్యేక నిధుల నుంచి రూ. 5.80 కోట్లను అందించారు. అందులో రూ.1.30 కోట్లు మొదటి దఫాగా, మరో రూ. 4.50 కోట్లను రెండో దఫాగా విడుదల చేశారు. ప్రస్తుతం రూ.1.30 కోట్లతో హాలియా మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్య వ్యవస్థ మెరుగు కోసం డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నారు.
పారిశుధ్యం మెరుగు
హాలియా మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గతంలో పారిశుధ్యం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు వీధుల్లోనే నిల్వ ఉండి ప్రజలు నడిచేందుకు కూడా వీలులేక పోయేది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దారుణం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. దాంతో మట్టిరోడ్లు కనిపించకుండా పోయాయి. మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా మారడంతో దోమల బెదడ తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి
ఎమ్మెల్యే నోముల భగత్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వం అందించిన నిధులతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. పట్టణంలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నాం. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
-వెంపటి పార్వతమ్మ, మున్సిపల్ చైర్పర్సన్, హాలియా
హాలియా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా
హాలియా మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. గతంలో ఇచ్చిన హామీ ల్లో భాగంగా ఇప్పటికే మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, డిజిటల్ లైబ్రరీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు అంతర్గత రహదారులు, పారిశుధ్య వ్యవస్థ మెరుగునకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాం. పనులు కూడా జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారుతాయి.
-నోముల భగత్‌కుమార్, ఎమ్మెల్యే