న్యూఢిల్లీ: జాతీయ గేయం వందే మాతరం ఆలాపనపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయంలోని మొత్తం ఆరు చరణాలను ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక, పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఆలపించాలని బుధవారం హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించే వారు. తర్వాత దుర్గా మాత గొప్పదనాన్ని తెలియజేసే చరణాలను ఆలపించే వారు కారు.
అయితే ఇకపై మొత్తం గేయాన్ని ఆలపించాల్సిందే. పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యకలాపాల్లో జాతీయ గీతం జనగణమనకు ముందు దీనిని తప్పక వినిపించాలి. ఆ గేయం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిల్చోవాలి. అలాగే పౌర అవార్డుల ప్రదాన సమయంలో, రాష్ట్రపతి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కూడా ఆలపించాలి.
ఇక సినిమా హాళ్లలో కూడా దీనిని ఆలపించాలి. అయితే ప్రేక్షకులు ఆ సమయంలో నిల్చుని ఉండనక్కర్లేదు. జాతీయ జెండాను ఎగురవేసే అన్ని సందర్భాలూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించడం తప్పనిసరి. మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గేయాన్ని ఆలపించవచ్చు. ప్రతి రోజూ ఉదయం పాఠశాలలో జరిగే అసెంబ్లీలో విద్యార్థులు సామూహికంగా ఈ ఆరు చరణాల పూర్తి గేయాన్ని పాడాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతర గేయం రచించి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నూతన మార్గదర్శకాలను తీసుకువచ్చారు.