సూర్యాపేట, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం తీసుకున్న ధాన్యాన్ని తెగనమ్ముకున్న విషయంలో సీజ్ చేసిన ఓ మిల్లులో మిషనరీ మాయమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధాన్యాన్ని మాయం చేసిన సదరు మిల్లు యజమాని ఇతరుల పేరిట మరో మిల్లు నిర్మిస్తూ సీజ్ చేసిన మిల్లులోని మిషనరీని అక్రమంగా అక్కడకు తరలించినట్లు తెలుస్తున్నది. సీఎంఆర్‌ను కొందరు అక్రమార్కులకు వరంలా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే వాటిని మిల్లింగ్ చేయడం మానేసి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని అడ్డదారుల్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయలు ఖాజేసిన సూర్యాపేట జిల్లాలోని ఐదు మిల్లులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మొదట మూడు మిల్లులను సీజ్ చేసి యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపగా, వారు బెయిల్‌పై బయటకు వచ్చి దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సీఎంఆర్ కోసం ఒత్తిడి పెరుగడంతో మరో రెండు మిల్లుల యజమానులు కూడా పైరవీ చేసి మరీ అధికారులతో కేసులు నమోదు చేయించుకున్నారనే ప్రచారం ఉంది.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఐదు మిల్లులు సీజ్ కాగా, లెక్క ప్రకారం ధాన్యం లేని మిల్లులు మరో ఏడెనిమిది వరకు ఉంటాయన్నది అధికారుల అంచనా. వారంతా ఎప్పుడు బిచానా ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్నే గాక ఏకంగా మిల్లులో ఉన్న మిషనరీని కూడా మాయం చేస్తున్న ఘనులు ఉన్నట్లు తెలుస్తున్నది. జిల్లాలోని ఓ మిల్లులో సుమారు 40 కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న యజమాని అందులో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే మిషనరీని కూడా ఎత్తుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సీజ్ చేసి ఉన్న మిల్లుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలోనే మరొకరి పేరిట కొత్త మిల్లు నిర్మిస్తూ మిషనరీని అక్కడకు తరలించారని తెలిసింది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం అక్రమాల్లో అధికారుల పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నది. ధాన్యం మాయమైందని మిల్లును సీజ్ చేసిన సమయంలో పంచనామా ఎలా చేశారు? అందులో మిషనరీతోపాటు ఇతర సామాగ్రి ఎంత? ధాన్యం ఎంత ఉంది? అనేవి రాశారా, లేదా? అసలు మిల్లుకు తాళం వేసి వచ్చారా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.