యాదగిరిగుట్ట, జూన్ 28: రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల పోలీస్స్టేషన్లు, దాదాపు 16 మంది విలేకరులకు డబ్బులు ఇచ్చాం. అవి ప్రభుత్వ భూములు కావు.. ఎస్సీలకు సంబంధించినవి..ఆ భూములను స్థానిక అధికారులు, పోలీసులను మేనేజ్ చేసుకొని తవ్వకాలు చేపట్టవచ్చని మైనింగ్ అధికారులే చెప్పారు. మండల ఎమ్మార్వోకు, విలేకరులకు ముడుపులు అందజేశామని, పెద్దగా ఇబ్బందులేవీలేవని, రెండు,మూడు రోజుల్లో మట్టి తవ్వకాలు పూర్తవుతాయని రాజాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్కాల గాల్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన మరో కాంగ్రెస్ నేత సుధాకర్‌తో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎవరో అధికారులు, విలేకరులు తనకు ఫోన్ చేసి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వివరణ కోరుతున్నారని కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ అడిగిన ప్రశ్నకు గాల్‌రెడ్డి మాట్లాడుతూ చల్లూరు చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, ఎవరెవరికి ముడుపులు ముట్టాయో, ఇందులో ఎవరెవరి ప్రమేయముందో సూదిగుచ్చినట్లుగా వివరించారు. దీంతో రాజాపేట మండలంలోని చెరువుల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల్లో అసలు నిజాలు బట్టబయలయ్యాయి.
ఎవరో అడిగితే భయపడేది లేదని, అడిగిన వారందరికీ డబ్బులు ముట్టాయని వివరణ ఇచ్చారు. ఎస్సీలకు సంబంధించిన పట్టా భూములు కావడంతో వారు విక్రయించగా మట్టి తరలింపు జరుగుతుందని చెప్పారు. మన చల్లూరు గ్రామానికి చెందిన వారు కావడంతో సహకరిస్తున్నామని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేశాడని మట్టి తవ్వకాలపై వివరణ అడిగారని అన్నారు. ప్రభుత్వ భూమి కాదు. పట్టాభూమి కావడంతో మైనింగ్ అనుమతులు అవసరం లేదని, స్థానికంగా ఉన్న అధికారులు మేనేజ్ చేసుకుని తవ్వకోండంటూ మైనింగ్ అధికారులు చెప్పడం వంటి మాటలు సంచలనంగా మారాయి.
దీంతో మూడు మండలాలకు చెందిన అధికారులు, విలేకరులు, పోలీసులకు డబ్బులను ముట్టజెప్పి తవ్వకాలు సాగిస్తున్నామని చెప్పారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలు అవసరమని వారిని మనం కాపాడుకుంటేనే ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులను గెలిపించుకోవచ్చని మాట్లాడారు. పలు మార్లు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసేందుకు వెళ్లాం.
ఎమ్మెల్యే తమ్ముడు శంకర్‌తో కలిసి స్వయంగా నేనే వెళ్లి ఎమ్మెల్యేను కలిసి విషయం చెప్పానని అర్కాల గాల్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎమ్మెల్యే మెడకు చుట్టుకోనున్నది. దాదాపుగా ఎమ్మెల్యేకు కన్నుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేసేందుకు అక్రమంగా డబ్బులు సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అనుమతులు లేవు..
చల్లూరు గ్రామంలోని మల్పవోని చెరువు నుంచి మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు. అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం రావడంతో 24వ తేదీన 23 టిప్పర్లపై కేసులు నమోదు చేశాం. మట్టిని తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– ఆర్డీవో కృష్ణారెడ్డి
ఎమ్మెల్యే అండతోనే అక్రమంగా మట్టి తరలింపు
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అండదండలతోనే మట్టి అక్రమ తరలింపులు సాగుతున్నాయనేందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణే ఇందుకు ఉదాహరణ. 8 రోజులుగా ఎమ్మెల్యే సోదరుడు బీర్ల శంకర్, చల్లూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు అర్కాల గాల్రెడ్డితోపాటు మరి కొంత మంది అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చల్లూరు గ్రామ సర్వే నంబర్ 179లోని మల్పవోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. స్థానిక అధికారులు, పోలీసులకు మామూళ్లు అందజేసి వారంరోజులుగా మట్టిని తరలించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
వాస్తవానికి అక్రమంగా మట్టి తరలింపులో 60 టిప్పర్లను వినియోగిస్తే కేవలం 39 టిప్పర్లపైనే కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో పాటు మూడు హిటాచీలు నడిచాయని వాటిపై, మిగతా 21 టిప్పర్లపై ఎందుకు కేసు నమోదు చేయలేదో పోలీసులు చెప్పాలి. ఎమ్మెల్యే సోదరుడు బీర్ల శంకర్‌కు చెందిన టిప్పర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదో చెప్పాలి. అక్రమంగా మట్టి తరలిస్తుంటే కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదో తెలియదు.
ఇప్పటికే సుమారుగా రూ. 2 కోట్ల విలువగల మట్టిని తరలించారు. ఇది పెద్ద కుంభకోణంగా పరిగణిస్తున్నాం. బీర్ల శంకర్‌కు చెందిన టిప్పర్లను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు తావిస్తోంది. ప్రతి చెరువును రక్షించుకునే బాధ్యత తీసుకుంటాం. దీనిపై ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం.
– గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి