చండూరు, జనవరి 08 : చౌక ధరల దుకాణాల నిర్వహణలో ఆలసత్వం, నిర్లక్ష్యం పనికి రావని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. చౌక ధరల దుకాణం నిర్వహణ చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం ఆయన రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొందరు డీలర్లు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటీవలి కాలంలో డీలర్లపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. గోదాము నుండి బియ్యం తీసుకువచ్చేటప్పుడు తూకం సరిచూసుకోవాలన్నారు. డీలర్లు సమయ పాలన పాటించాలని, రేషన్ బియ్యం ఉండే రూములు పరిశుభ్రంగా ఉంచాలని, కనీస సమాచారం ఇవ్వకుండా రేషన్ దుకాణంను మూసి ఉంచితే కేసు నమోదుకు కూడా వెనకాడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.