గరిడేపల్లి, జూలై 17 : భయం వీడితే విజయం మనదే అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు చారుగుండ్ల రాజశేఖర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలను అర్థం చేసుకుని చదువాలన్నారు. ప్రతీ నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నారు. ఎవరితో ఎలా నడుచుకోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడికి లోను కాకుండా ఉండడం, ఉత్తమ ఫలితాలు సులభంగా సాధించేందుకు కావాల్సిన సాధన తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఎంఈఓ పానుగోతు చత్రునాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు ప్రపంచ జ్ఞానం పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ విజయకుమారి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.