సూర్యాపేట, మార్చి 26 : క్యాన్సర్ ను తొలిదశలో గుర్తిస్తే నివారణ సులభమని అలా గుర్తించేందుకు వీలుగా కీ.శే.కొంగరి భవాని, ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత కొల్లు మధుసూదన్ రావు, కొంగర భవాని ట్రస్టు చైర్మన్ కొంగర రామచంద్రరావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ఎంఎస్ఆర్ కిడ్జ్ పాఠశాలలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. నేటి సమాజంలో క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరిలో ప్రమాదకరంగా మారిందని దీన్ని త్వరగా గుర్తించకపోవడం, చివరి దశల్లో గుర్తించడంతో రోగ నిరోధక శక్తి తగ్గి చికిత్స చేసినా ప్రయోజనం లేకుండా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు.
తొలి దశలో క్యాన్సర్ ను గుర్తించగలిగితే చికిత్స సులభమై ప్రాణాపాయం నుంచి భయటపడవచ్చన్నారు. అలాంటి క్యాన్సర్ ను ముందుగా గుర్తించేందుకు ఎంఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి హెచ్ ఓడి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ కు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అనుమానాస్పదమైన గడ్డలు, మానని పుండు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ లక్షణాలు త్వరగా కనిపించవని ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకుంటే ముందుగా క్యాన్సర్ ను గుర్తిస్తే తక్కువ ఖర్చుతో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 200 మందితో పాటు మరో 100 మందికి మొత్తం 300 మంది వరకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసి సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కొల్లు శ్రీనివాసరావు, చేతన ఫౌండేషన్ చైర్మన్ సీతారామయ్య, డాక్టర్లు రవిశంకర్, శైలజ, మాన్విత, రేడియాలజిస్ట్ ప్రభాకర్ నర్సింగ్, టెక్నీషియన్ సిబ్బందితో పాటు సూర్యాపేట చందన నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

‘క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే నివారణ సులభం’