గట్టుప్పల్, మే 15 : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. గడిచిన ఆదివారం గట్టుప్పల్ మండలం వెలుమకన్నె గ్రామంలో జరిగిన హత్య కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో వెల్లడించారు. గట్టుప్పల్ మండల పరిధిలోని వెలుమకన్నె గ్రామానికి చెందిన వల్లపు మల్లేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడి భార్య హేమలతకు అదే గ్రామానికి చెందిన వివాహితుడు రేవెల్లి నవీన్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. తనను దూరం పెడుతుండడంతో భార్య హేమలత ప్రవర్తన మీద అనుమానం కలిగిన భర్త మల్లేశ్ నిఘా పెట్టడంతో భార్య అక్రమ సంబంధం బయటపడింది. పలుమార్లు మందలించినా ఆమె తీరు మారలేదు.
కాగా తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త మల్లేశ్‌పై కక్ష పెంచుకుంది. ప్రియుడు నవీన్‌తో కలిసి హతమార్చాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారం మల్లేశ్‌కు నవీన్ ఫుల్‌గా మద్యం తాపించి ఇంటిదగ్గర దింపాడు. మద్యం మత్తులో ఉన్న మల్లేశ్‌ను అదే అదునుగా భావించి నవీన్, హేమలత గొంతు నులిమి హత్య చేశారు. దాన్ని సాధారణ మరణంగా చిత్రీకరింపజూశారు. కోడలు హేమలత ప్రవర్తనపై అనుమానం కలిగిన మల్లేశ్ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు చేధించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టప్పల్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ అంజయ్య, సిబ్బంది రమేశ్, సుదర్శన్‌ను డీఎస్పీ అభినందించారు.