సూర్యాపేట, ఏప్రిల్ 1 : కార్పోరేట్ ఫౌల్ట్రీ యజమానులు సిండికేట్‌గా మారి టేడర్లకు, చిన్న దుకాణాలకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ సూర్యాపేట పట్టణ చికెన్ సెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం చికెన్ షాపులు బంద్ పెట్టి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు టి.తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పోరేట్ ఫౌల్ట్రీ యజమానులు రోజుకో విధంగా చికెట్ ధర నిర్ణయించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, వినియోగదారుల చేత మాటలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫౌల్ట్రీ యజమానులతో ప్రభుత్వం చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్.కె.అఫ్జల్ మాట్లాడుతూ.. కార్పోరేట్ పౌల్ట్రీఫాంలు తమ బాధను అర్థం చేసుకుని గతంలో ఇచ్చిన మాదిరిగానే మార్జిన్ ఇచ్చి వ్యాపారాలు సజావుగా సాగేలా సహకరించాలన్నారు. వినియోగదారులు కూడా జరుగుతున్న పరిణామాలను, చికెన్ దుకాణాల యజమానులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాల్సిందిగా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.వి.రెడ్డి, సైదులు, కిరణ్ రెడ్డి, ఎజాజ్, ఇంతియాజ్, మణికంఠ, అనంతు, అయుబ్‌ఖాన్, రాయాల్ మాలిక్, ఆర్.ఆర్.వెంకటేష్, రేష్మా ఫరీద్, రాజు పాల్గొన్నారు.