హాలియా, ఏప్రిల్ 5 : ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతున్నకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రేవంత్రెడ్డి పాలనలో రైతు సంక్షే మం నోటి మాటగా, కాగితాలకే పరిమితమైంది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతు తాను పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక అగచాట్లు పడుతున్నాడు. రబీలో వరి కోత లు ప్రారంభమై పక్షం రోజులు దాటినా ఇప్పటికీ అధికారులు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్క ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తే ఇప్పటి వర కు ఒక్క ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రా న్ని ఏర్పాటు చేయకపోయినా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కనీసం స్పందించలేదు.
లక్ష ఎకరాల్లో సాగు..
నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీ లోలెవల్, హైలేవల్ కెనాల్ కింద ఉన్న రైతులు యాసంగిలో లక్ష ఎకరాల్లో వరి సాగుచేశారు. అందు లో 80 శాతం సన్నరకం ధాన్యం కాగా 20 శాతం దొడ్డురకం. ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గత 15 రోజుల నుంచి కోతలు కోస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆరు మండలాల్లో ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దాఖలాలు లేవు. దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు ప్రభుత్వ తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరి కోతలకు ముందే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకునేవారు. కోతలు కోసిన ధాన్యాన్ని కోసినట్లే ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చేవారు. మ్యాచర్ రాగానే ఐకే పీ సిబ్బంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం లో వరికోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు..
రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు. యాసంగి సీజన్ వరికోతలు ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తే క్వింటాకు రూ.500ల బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ధాన్యం సేకరణలో రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. జిల్లాలో నాగార్జున సాగర్ ప్రథమ స్థానంలో ఉండేది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే
మిల్లర్ల దోపిడీ..
సాగర్ నియోజకవర్గంలోని 196 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఎక్కడా ఒక్క ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంబించకపోవడంతో గత్యంతరం లేక రైతులు తాము పండించిన పంటను మిల్లుకు తీసుకుపోయి అమ్ముకోవాల్సిన దుస్థి తి ఏర్పడింది. ఇదే అదనుగా మిల్లర్లు మ్యాచర్, తాలు సాకుతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. నియోజకవర్గంలో మిల్లర్లు రేట విషయంలో సిండికేట్ కావడంతో తాము అనుకున్న రేటుకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు మిల్లర్లు అడిగిన రేటుకు ధాన్యాన్ని అమ్మేస్తున్నారు.