నీలగిరి, జూన్ 4 : నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో వాటర్‌ట్యాంక్‌లో వ్యక్తి మృతదేహం లభించడం, ఆ నీరే ప్రజలకు సరఫరా కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఆశాఖ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రాములబండ పీహెచ్సీ, లైన్‌వాడ యూహెచ్‌సీ సిబ్బంది నాలుగు వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ జమీర్, సూపర్వైజర్లు కిరణ్‌కుమార్, పద్మ, 12 మంది ఆశ వర్కర్లు, 8 మంది ఏఎన్ఎంలు నాలుగు బృందాలుగా ఏర్పడి సుమారు వెయ్యి ఇండ్లకు వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నారా అనే కోణంలో సర్వే నిర్వహించారు. అక్కడక్కడ కొద్దిమంది సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన సిబ్బంది అందుకుగల కారణాలను తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేశారు. వారికి నీటి కాలుష్యంతో కాకుండా సాధారణ జ్వరాలుగానే గుర్తించారు. నాలుగు వార్డుల పరిధిలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డీప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు ధనలక్ష్మి, నాగమణి, భాగ్యలక్ష్మి, పలువురు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
మున్సిపాలిటీ అధికారులు మంగళవారం వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేశారు. ట్యాంక్‌లో క్లోరినేషన్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారి ఇండ్లల్లో ఉన్న నీటిని ఖాళీ చేయించి ట్యాంకర్ల ద్వారా శుభ్రమైన నీటిని సరఫరా చేశారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయం నుంచి తిరిగి ట్యాంక్ ద్వారా ఆయా వార్డుల పరిధిలో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని మున్సిపల్ కమిషపర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.