– భోజనంలో పురుగులు
– నార్కట్‌పల్లి-నల్లగొండ రహదారిపై రాస్తారోకో
రామగిరి, ఫిబ్రవరి 02 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ మెస్‌లో అందించే భోజనంలో తరచుగా పురుగులు వస్తుండడాన్ని నిరసిస్తూ విద్యార్థులు సోమవారం వర్సిటీ ప్రధాన ద్వారం నార్కట్‌పల్లి-నల్లగొండ ప్రధాన రహదారిపై దర్నాకు ఉపక్రమించారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి, హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్, హాస్టల్ వార్డెన్స్ విద్యార్థుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిత్యం ఇవే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ సమస్యలు ఎందుకు పరిష్కరించరని విద్యార్థులు ప్రశ్నించారు.
నార్కట్‌పల్లి పోలీసులు వచ్చినప్పటికీ తమ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని విద్యార్థులు భీష్మంచి కూర్చున్నారు. యూనివర్సిటీ హాజరు విషయంలో 75 శాతం ఉండాలని నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్న వీసీ, యూనివర్సిటీ విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతుంటే ఎందుకు సమస్యను పరిష్కరించారని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ వీసీ బెదిరింపు దోరణితో వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

MGU : ఎంజీయూలో హాస్టల్ విద్యార్థుల ఆందోళన