మునుగోడు, జులై 11 : ఉన్న ఇల్లుని కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడం లేదని, తన ఇల్లు తనకే ఇప్పించాలని కోరుతూ కొడుకుపై ఆర్డీఓ ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో బాధిత కుటుంబం న్యాయం చేయాల్సిందిగా కోరుతూ శుక్రవారం గ్రామ పంచాయతీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగారం గ్రామానికి చెందిన కోడి చంద్రయ్యకు కొడుకు రాములు, కూతురు అలివేలు ఉన్నారు. ఇరువురికి వివాహాలయ్యాయి.
అయితే ఇటీవలి కాలంలో కొడుకు రాములు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ తండ్రి చంద్రయ్య ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. కూతురుకు ఇల్లు గిఫ్ట్ డీడ్ చేయడంతో కొడుకు ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాడు. 28 సంవత్సరాలుగా ఉమ్మడిగా నివాసం ఉంటున్న తమను పిల్లలతో సహా బయటకు పంపితే బ్రతికేది ఎట్లా అని కొడుకు రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా వినకుండా పదేపదే పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయంపై నల్లగొండ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో పాటు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసినట్లు చెప్పాడు. వాస్తవాలు విచారించి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.