ఆత్మకూరు(ఎం), జనవరి 16 : సంక్రాంతి పండుగ పూట ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరిట ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నది. గతం కంటే 50శాతం చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నది. గతంలో ఆత్మకూరు(ఎం) నుంచి రాయిగిరి వరకు ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.40 ఉండగా ఇప్పుడు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఆత్మకూరు(ఎం) నుంచి ఉప్పల్ వరకు గతంలో రూ.120 ఉండగా, ఇప్పుడు రూ.180 తీసుకుంటున్నారు. పండుగకు ఊరెళ్దామంటే ఆర్టీసీ అధికారులు చార్జీలు పెంచి నిలువుదోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్న పేదలు పండుగకు స్వగ్రామానికి వచ్చి పోయేందుకు పెంచిన చార్జీలను చూసి లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం పునరాలోచించి పండుగ పూట చార్జీలు పెంచకుండా చూడాలని కోరుతున్నారు.