నల్లగొండ ప్రతినిధి, జనవరి22(నమస్తే తెలంగాణ) : నల్లగొండ క్లాక్‌టవర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు ప్రభుత్వం సిద్ధమైతే ప్రభుత్వం అడ్డుపడగా హైకోర్టు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలుత ఈ నెల 21వ తేదీన రైతు మహాధర్నా కోసం అనుమతి కోరితే… పోలీసు యంత్రాంగంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. మర్నాడు ధర్నా అనగా 20వ తేదీన అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వెంటనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ధర్నాకు అనుమతి కోసం పోలీసులకు లేఖ ఇచ్చిన బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ పేరుతో పార్టీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా బుధవారం హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా నిర్వహించుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
దీంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు మహాధర్నా ఏర్పాట్లపై దృష్టి సారించారు. అదే క్లాక్‌టవర్ వేదికగానే మహాధర్నాను నిర్వహించేందుకు, భారీగా రైతులు తరలివచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. వాస్తవంగా మహాధర్నాను ఈ నెల 21న నిర్వహణ కోసం నాలుగు రోజుల ముందుగానే నల్లగొండ డీఎస్పీకి బీఆర్ఎస్ నేత దేవేందర్ అనుమతి కోసం లేఖ అందించారు. 18న ఇదే విషయమై పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కూడా కలిశారు. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించడంతో పార్టీ నేతలు మహాధర్నా ఏర్పాట్లపై దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా రైతులు తరలివచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
నల్లగొండలో సైతం ధర్నా ఫెక్సీలను, హోర్డింగ్స్, కటౌట్లను ఏర్పాటు చేశారు. వాహనాలు, మైక్ సిస్టం, తాగునీరు, ఇతర సదుపాయాలన్నీ దాదాపు పూర్తి చేశారు. ఇవన్నీ ఇలా ఉండగా ధర్నాకు ఒక రోజు ముందు ఈ నెల 20న సడెన్‌గా పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. అప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తూ ధర్నాకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ నెల 27 వరకు తాము గ్రామసభలు, రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని ప్రభుత్వ ప్లీడర్ కోర్టుకు తెలపడంతో హైకోర్టు ఈ నెల 28న ధర్నాకు అనుమతించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులా మారగా… బీఆర్ఎస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో రైతు మహాధర్నాకు సిద్ధమవుతుండడం విశేషం.