భువనగిరి అర్బన్, అక్టోబర్ 11: బాధితులకు సత్వరమే న్యాయం అందేలా చూసి, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నైతిక విలువలు పాటిస్తూ చిత్త శుద్ధితో కృషి చేయాలని హై కోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన భువనగిరిలో జిల్లా కోర్టు భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
అంతకు ముందు ఆయన పోలీసు శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీజే మాట్లాడుతూ భువనగిరి పట్టణం హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున ఇక్కడి కోర్టులపై భారం అధికంగా ఉంటుందని, త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉంటే తద్వారా దేశం పురోగమిస్తుందన్నారు. సాయుధ దళాలు జాతి రక్షణ కోసం ముందుండి దేశ సేవ చేస్తున్నాయని, దానిని మనం ఆశయంగా తీసుకోవాలన్నారు. వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయ సేవలు అందించాలన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్రేటివ్ న్యాయమూర్తి కె.శరత్, హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన, జస్టిస్ వి.రామకృష్టారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.జయరాజు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిదా, జిల్లా న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత, భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యామ్‌సుందర్, రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సబిత, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, రామన్నపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సరిత, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ సీపీ సుదీర్‌బాబు, డీసీపీ అక్షాంశ్ యాదవ్ జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
గుట్టలో హైకోర్టు సీజే ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, అక్టోబర్11: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తులు కె.లక్ష్మణ్, శరత్, కె.సుజన, రామకృష్ణారెడ్డిలకు కలెక్టర్ హనుమంతరావు, ఇన్చార్జి ఈవో గుగులోత్ రవినాయక్ స్వాగతం పలికారు. సీజే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆలయంలో ప్రధాన అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వయంభూ పంచనారసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్, ఇవోతో పాటు సీపీ సుధీర్‌బాబు, డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, ఆలయ ఉప ప్రధానార్చకులు మంగళగిరి నరసింహమూర్తి, అధికారులు జూశెట్టి కృష్ణ, నవీన్, గజవెల్లి రఘు, రాజన్‌బాబు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్ నాయక్, సీఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.