కోదాడ రూరల్, సెప్టెంబర్ 29 : కోదాడ ప్రాంతాన్ని ముంచెత్తిన భారీ వానలు, వరదలకు అనేక మంది నష్టపోయారు. కొందరి ఇండ్లు పూర్తిగా కొట్టుకుని పోయి నిలువ నీడ లేకుండా ఉన్నారు. మరి కొందమంది ఇంటి సామగ్రి పూర్తిగా వరదకు కొట్టుకుని పోయి నిరాశ్రయులుగా మిగిలారు. బాధితుల గ్రామాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించి నష్టాలను అంచనా వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
కానీ కోదాడ మండల అధికారులు బాధితుల వివరాల సేకరణలో పలు మెలికలతో పేర్లు నమోదు చేయకపోవడంతో అర్హులైన వారికి సాయం అందలేదు. దాంతో వరద బాధితులు ఆందోళనలు, నిరసనలకు దిగారు. గురువారం అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన వారు, శుక్రవారం కోదాడ మండల పరిధి కూచిపూడి గ్రామానికి చెందిన వారు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రేషన్ కార్డు ఉంటేనే వరద సాయం వస్తుందని, లేకుంటే రాదని అధికారులు చెప్తున్నారు. దీంతో కార్డులు లేని వారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పూర్తిగా సామాన్లు తడిచినా..
కోదాడ పట్టణంలో సైతం వరద ఇండ్లను ముంచెత్తడంతో ఎంతో మంది నష్టపోయారు. పైఅంతస్తులో బిక్కు,బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. కొందరు లైఫ్బోట్ల సహాయంతో బయటపడ్డారు. కానీ అలాంటి వారికి సాయం అందలేదు. పట్టణంలోని సాయినగర్‌లో ఓ కుంటుంబ పూర్తిగా ఇల్లు నీట మునగడంతో తెల్లవార్లు ఇంటిపైనే గడిపారు. ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిచిపోయాయి. ఆ కుటుంబానికి సైతం వరద సాయం అందలేదు. వరద వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులకు సర్వేకు వచ్చిన అధికారులు, నాయకులు, ఇతరులు చెప్పిన ప్రకారమే పేర్లు నమోదు చేసుకున్నారని, అసలైన బాధితులను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
రేషన్ కార్డు లేదని నిత్యావసర సరుకులు ఇవ్వలేదు
నా ఇల్లు ఊర్లోని అంతర్గంగా వాగు సమీపంలో ఉండటంతో వరద ఇంటిని ముంచెత్తింది. మా ఇంటిలోని సామాన్లతోపాటు ద్విచక్రవానం నీళ్లలో కొట్టుకుని పోయాయి. అధికారులు నాకు రేషన్ కార్డులేదని బాధితుల జాబితాలో పేరు రాయలేమని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వరద సాయం లేకపోగా నిత్యావసర సరుకులు సైతం ఇవ్వలేదు. ఇప్పటికైనా పత్రాలు, రేషన్ కార్డులు కాకుండా బాధితులకు న్యాయం చేయాలి.
-నందిగామ యేసురాణి, కూచిపూడి, కోదాడ మండలం
అర్హులందరికీ సాయం అందించాలి
వరదలకు కూచిపూడి గ్రామంలో సుమారు 300 ఇండ్లకుపైగా వరద నీరు చేరి ప్రజలు నష్టపోయారు. అధికారులు 293 మంది పేర్లు నమోదు చేశారు. ఇంకా సుమారు 50 నుంచి 60 మంది అర్హులైన వరద బాధితులకు పరిహారం అందలేదు. నడి ఊర్లో ఉన్న నష్టపోని వారికి ప్రభుత్వ సాయం అందించారు. అధికారులు ఇష్టారాజ్యంగా కాకుండా నిజమైన బాధితులను గుర్తించాలి. అందుకు మరోసారి సర్వే జరిపించాలి.
– శెట్టి సురేశ్‌నాయుడు, కూచిపూడి మాజీ సర్పంచ్