నల్లగొండ, మే 1: ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జిల్లాలో బుధవారం అత్యధికంగా మునుగోడు మండలం గూడపూర్లో 46.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే ఎక్కువ ఉష్ణోగ్రత. ఎండలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయం 8గంటల నుంచే మొదలవుతున్న ఎండ వేడిమి మధ్యాహ్నం వరకు నిప్పుల కుంపటిగా మారుతున్నది. పది గంటలు దాటిందంటే ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీలు ఉంటున్నాయి. రాత్రి 9 గంటలైనా సెగ తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో జనం లేక రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలకు ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగింది. ఎండ సెగకు తట్టుకోలేక చల్లదనం కోసం జనం వెతుకులాడుతున్నారు. వడదెబ్బ తగులకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
