పెన్పహాడ్, జులై 03 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అపరిశుభ్రతపై జిల్లా ఆరోగ్య అధికారి పి.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరును పరిశీలించారు. దవాఖానాలో అవసరమైన మందులు, ఇంజక్షన్లు, వివిధ వైద్య సామగ్రి సరిపడా ఉన్నాయా లేవా అని మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతిని అడిగి తెలుసుకున్నారు. దవాఖాన ఆవరణంలో ఎక్కడి చెత్త అక్కడే, ఎక్కడి వస్తువులు అక్కడే ఉండడంతో డాక్టర్ స్రవంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు వ్యాధులు నయం చేసే ఆస్పత్రే పరిశుభ్రంగా లేకుంటే వైద్య సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణీలు, పిల్లలు, ఇతర రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆస్పత్రిలో ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దవాఖాన సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రాజు, భూతరాజు శ్రీనివాస్, భూతరాజు సైదులు పాల్గొన్నారు.