చండూరు, జూలై 19 : త్రిఫ్ట్ ఫండ్ కడుతున్న కార్మికులందరికీ నేతన్న భరోసా కల్పించాలని పద్మశాలి సంఘం చండూరు అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య అన్నారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘం సభ్యులతో కలిసి శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర చేనేత, జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతన్నకు భరోసా పథకానికి సంబంధించిన నిబంధనలు కార్మికులకు ఇబ్బందిగా ఉన్నాయన్నారు.
దీనిపై శైలజా రామయ్యర్ స్పందిస్తూ.. నేతన్నకు భరోసా పథకానికి సంబంధించిన విధివిధానాలు కార్మికులకు సులభతరంగా, ఉపయోగకరంగా ఉంటాయన్నారు. చేనేత ఉత్పత్తులకు సంబంధించిన లేబుల్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే ఎవరు తయారు చేసింది, ఎక్కడ తయారైంది వంటి అన్ని విషయాలు ఉండేటట్లు చూస్తామన్నారు. అదే విధంగా నేతన్నకు భరోసా పథకం అవగాహన కోసం త్వరలో కరపత్రాలు పంపిణీ చేస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి, చేనేత కార్మిక సంఘం, చేనేత పరిరక్షణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.