చివ్వేంల, మర్చి 10 : చేతి సంచి పర్యావరణానికి మంచి అని గ్రీన్ క్లబ్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేతి సంచి వాడకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో కలిగే అనర్ధాలు, డ్రైనేజీలు, పొడి చెత్తను వేరు చేయకుండా తడి, పొడి చెత్తను కలిపి కవర్లలో వేసి పారవేయడం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. పశువులు, పక్షులు, జలచరాలు అన్ని కవర్లతో పాటు ఆహారం తింటుండంతో మృత్యువాత పడుతున్నట్లు చెప్పారు.
ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకుని తినడం ద్వారా క్యాన్సర్ వ్యాధికి గురికావడం జరుగుతుందన్నారు. జీవరాశి రక్షణకు, పర్యావరణ సమతుల్యతకు ఇంట్లో నుండి బయల్దేరేప్పుడే చేతి సంచి తీసుకుని వెళ్లడం మన విధిగా, బాధ్యతగా మారాలన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చేతి సంచులను బహుకరించారు. ఇంటి నుండి బయల్దేరేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేతి సంచితో బయల్దేరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీవీ లక్ష్మీనారాయణ, తల్లాడ రామచంద్రయ్య పాల్గొన్నారు.