రామగిరి, జనవరి 6 : నల్లగొండ పట్టణంలోని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో చేపడుతున్న పది రోజు రిలే నిరాహార దీక్షను సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది దాటినా, నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 48వ వార్డులో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను గుర్తించినా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించలేదని, ఇకనైనా స్పందించి వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో ఆ పార్టీ నాయకులు సయ్యద్ హశం, దండెంపల్లి సత్తయ్య, ఎండీ సలీం, తుమ్మల పద్మ, కోట్ల అశోక్‌రెడ్డి, కల్లూరి లక్ష్మి పాల్గొన్నారు.