నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు8(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇదే శుభతరుణమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణలోగానీ జిల్లాకు చెందిన వారెవ్వరూ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన వారు లేరని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా అవకాశం రావడంతో జిల్లా ప్రాజెక్టులపై సహజంగానే ఆశలు చిగురించాయన్నారు. అందువల్ల మంత్రి ఉత్తమ్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ మేరకు గురువారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. పలు అంశాలపై స్పందిస్తూ డిండి ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టారని, కొన్ని పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. దానికి కృష్ణానదిలో నీటిని ఎక్కడ నుంచి తీసుకోవాలన్నది తేల్చాల్సి ఉందన్నారు. గతంలో ఏదుళ్ల నుంచి తీసుకోవాలన్న ప్రతిపాదన ఉందని, దీన్నే త్వరగా తేల్చి మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్ఎల్బీసీ సొరంగమార్గంపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
నక్కలగండి దాదాపు పూర్తి కావచ్చిందని, పెండ్లిపాకల రిజర్వాయర్ విస్తరణ పనులకు కొత్తగా టెండర్లు ఖరారు చేసి పనులు మొదలుపెట్టాలని చెప్పారు. సొరంగం పూర్తయితే గ్రావిటీ ద్వారానే తాగు, సాగునీరు అందుతుందన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డికాల్వలకు గతంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించారని, ఆ పనులు కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రానున్న కాలంలో మూసీ రివర్ ఫ్రంట్‌కు గోదావరి జలాలను తరలిస్తే మూసీలోనూ నిరంతరం నీటి ప్రవాహం ఉంటుందని తెలిపారు
అందువల్ల మూసీ కాల్వలను ఆధునీకరిస్తూ లైనింగ్ చేపట్టి శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే గోదావరి జలాలు జిల్లాకు వస్తున్నాయని, కృష్ణా జలాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు.