పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్న వారికి కండ్లు చెదిరేలా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నిరంతర విద్యుత్‌తో పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు అనేక సంక్షేమ పథకాలతో కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇతర ప్రాంతాలకు వలసలు ఆగిపోయాయని, చేతినిండా పని దొరకడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 4: పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంతో ప్రగతి సాధించుకొని.. ఎన్నో అద్భుతాలు సృష్టించుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుమంళీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిమ్మచీకట్ల మయమవుతుందని హేలన చేసిన వాళ్ల కళ్లు చెదిరేలా.. రాత్రులు సైతం పగటిని తలపించేలా తెలంగాణలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. నిరంతర విద్యుత్‌తో చేతినిండా పని కలిపించి కార్మికుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని ఆయన కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణలో పదేండ్లుగా ఆకలి చావులు, వలసలు ఆగిపోయాయని.. చేతినిండా పని కలిపించి అన్ని విధాలుగా ఆదుకుంటూ అందరి కడుపు నింపుతున్నామన్నారు.
నిరంతర విద్యుత్, పుష్కలమైన నీటితో పాటు ప్రశాంత వాతావరణం పెరగటంతో తెలంగాణలో పరిశ్రమలు పెరుగుతున్నాయన్నారు. దీంతో పెద్దపెద్ద వ్యాపారస్తులు సైతం ధైర్యంగా పెట్టుబడులతో ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనాత్మక మెడికల్ కళాశాలతో పాటు ఇతర జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కావడంతో పాలన చేరువ కావడంతో పాటు ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఐటీ హబ్‌తో పాటు ఎన్నో అతి పెద్ద వస్త్ర, వ్యాపార సంస్థలు, మాల్, మల్టీఫ్లెక్స్‌లు ఇలా అన్ని రకాల వ్యాపార సంస్థలు ప్రశాంత వాతావరణంలో తమ వ్యాపారాలు కొనసాగించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో కార్మికులకు చేతినిండా పని కలిపిస్తూ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఘనత కూడా ఒక్క తెలంగాణ రాష్ర్టానికి, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతే కాకుండా రాష్ర్టాన్ని సాధించుకుని అధికారం చేపట్టిన నాటి నుంచి దినదినాభివృధ్ధి చెందుతున్న తెలంగాణలో వలసల ఆగిపోవడమే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చి ఎంతో మంది కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతరం అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు.
అన్ని రంగాల అభివృద్ధితో పాటు కార్మికులను సైతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపొతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని కార్మిక కుటుంబాలకు ప్రత్యేకంగా కార్మికబీమా పెట్టి ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విషయం అందరికీ తెలియక ఎంతో మంది కార్మిక కుటుంబాలు ఆర్థిక నష్టపోయాయన్నారు. 18 ఏళ్లు నిండి 55 ఏండ్ల సంవత్సరాల వయస్సు కలిగిన కార్మిక కుటుంబాలన్నీ లేబర్ కార్డు పొందేందుకు అర్హులని తెలిపారు. ఇప్పటికే వీటిపై అవగాహన కలిపించి ఎంతో మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచామన్నారు. కార్మికులంతా ఐక్యతను పెంచుకుంటూ అభివృద్ధిలో మరింత ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గౌడ్, కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, సిలివేరు ప్రభాకర్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, వెంపటి గురూజీ, శివశంకర్, శివరామ్‌తో పాటు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.