నాంపల్లి, అక్టోబర్ 26 : కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి కోవర్టుగా మారి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు రాగానే పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నాంపల్లి మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం, వడ్డేపల్లి, టీపీ గౌరారం, తుంగపహాడ్ తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మోదీ సొంత రాష్ట్రంలో రైతులకు 6గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని, అది కూడా మోటర్లకు మీటర్లతో ఇస్తున్నారన్నారు. రైతులకు 24గంటల ఉచిత కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలో? మోసం చేసే బీజేపీ కావాలో? మునుగోడు ప్రజలు ఆలోచించాలన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని, కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టినా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, తమ రాష్ట్రంలో ఎందుకు లేవని మోదీని ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ ప్రజలు నిలదీస్తున్నారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే పచ్చని పల్లెల్లో మంటలు లేస్తాయని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి పార్టీని బలపర్చుకోవడానికి సొంత అన్నదమ్ములను విడదీసే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం గ్రామంలో అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రచారం నిర్వహించారు.
కార్పొరేట్ వ్యవస్థలతో చేతులు కలిపి రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలకు అండగా ఉంటూ సామాన్య ప్రజలపై ధరలతో భారం మోపుతున్న బీజేపీని ఓడిస్తే బుద్ధి వస్తుందన్నారు. వేలకోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌కు అవకాశమిస్తే, మళ్లీ మోసం చేస్తాడని, అతని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతాంగానికి అండగా ఉన్నందుకే టీఆర్ఎస్కు మునుగోడులో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి, కూసుకుంట్లను గెలిపించాలని కోరారు.
నాంపల్లి : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. నాంపల్లి మండలంలోని పసునూరు, చల్లవానికుంట, నామానాయక్తండా గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంట్రాక్టుల కోసం పాకులాడే వ్యక్తికి ప్రజా సమస్యలు పట్టవన్నారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన నిలబడే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన కూసుకుంట్లను గెలిపిస్తే నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ముందుకు సాగుతాయని సూచించారు. ప్రచారంలో దేవరకొండ, చేవెళ్ల, జడ్చర్ల ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కాలె యాదయ్య, లక్ష్మారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు పాల్గొన్నారు.
‘అయ్యా.. రాజగోపాల్‌రెడ్డి.. నీది చిన్న కంపెనీ అయితే అన్ని వేల కోట్ల ప్రాజెక్టు ఎలా వచ్చింది? ఆ ప్రాజెక్టు రావడానికి నీ వెనుక ఉన్న పెద్దలు ఎవరు? ప్రజలకు సమాధానం చెప్పాలి’.. అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి గుజరాత్ గులాం అని, రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో అతనికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గ్యాస్, పెట్రో ధరలు ఎడాపెడా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీకి మునుగోడులో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే ప్రభుత్వం నుంచి అధిక నిధులు వచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. నేడు దేశం మొత్తం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తున్నదని, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నదన్నారు. రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ రైతుబంధుతో ఏడాదిలో రెండు సార్లు పెట్టుబడి సాయం చేస్తున్నదని పేర్కొన్నారు. రైతుబీమాతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నదని చెప్పారు. 60ఏండ్లలో ఏ ప్రభుత్వాలు ఆలోచించని విధంగా టీఆర్ఎస్ సర్కారు పేదింటి ఆడపిల్ల పెండ్లికి రూ.లక్షా 116 ఇస్తూ తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తున్నద న్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ ఎస్ పక్షాన ప్రజలు ఉండాలని కోరారు. కార్యక్రమాల్లో సీపీఐ మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, పానుగంటి వెంకన్నగౌడ్, ఏడుదొడ్ల ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు బుషిపాక లీలప్రియ, దండిగ అలివేలు, ఎంపీటీసీలు బెక్కం రమేశ్, మాల్ మార్కెట్ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.