ఆత్మకూరు, మార్చి 9 : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయాలని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా, రిజర్వేషన్లు కేటాయించకుండా ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేస్తే మాదిగ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతనే ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలని, అప్పటివరకు ఫలితాల విడుదలను నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ, మండల ఉపాధ్యక్షులు పెడమర్తి ఉమేష్ మాదిగ, మండల అధికారి ప్రతినిధి మిరియాల చిన్ని మాదిగ పాల్గొన్నారు.