రామగిరి/మిర్యాలగూడ/సూర్యాపేట/చిలుకూరు/సూర్యాపేట టౌన్, డిసెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆది, సోమవారం నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగాయి. నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు మిర్యాలగూడలో 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ -1 ఉదయం 10 గంటలకు, పేపర్ -2 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా, కొన్ని పరీక్ష కేంద్రాల వద్దకు 10మందికిపైగా అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించ లేదు. దీంతో కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరిగారు. మరో వైపు పరీక్ష సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు లోపలికి పరుగులు తీశారు. ఉదయం హాజరుశాతం అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం జరిగిన పరీక్షకు కొంత మేర తగ్గడం గమనార్హం. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 29,118 మంది అభ్యర్థులకుగానూ 14,676 మంది (50.40 శాతం) హాజరయ్యారు. 14,442 మంది గైర్హాజరయ్యారు.
సూర్యాపేట జిల్లాలో 51 శాతం హాజరు
జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. కోదాడ రీజినల్ పరిధిలో 19 పరీక్ష కేంద్రాలు, సూర్యాపేట రీజినల్ పరిధిలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,857 మంది అభ్యర్థులకుగానూ సగం మంది మాత్రమే పరీక్ష రాశారు. పేపర్-1 16,857 మంది అభ్యర్థులకుగానూ 8,608 మంది హాజరుకాగా, 8,249 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2కు 8,570 మంది (50.83 శాతం) హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాల వద్ద సందడి
పరీక్షలకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు తెల్లవారు జాము నుంచే వచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారితో కిక్కిరిసి వచ్చాయి. దాంతో బస్టాండ్లు కిటకిటలాడాయి. ఉదయం 10గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9:30 గంటలకే కేంద్రా ల గేట్లను మూసివేశారు. కొంత మంది అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు రాగా, మరికొంతమంది సమయానికి వచ్చి పరుగులు తీశారు. పరీక్షలు రాసిన తర్వాత అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
చంటి పిల్లలతో వచ్చిన పలువురు అభ్యర్థులు
పరీక్ష కేంద్రాలకు కొంత మంది అభ్యర్థులు చంటి పిల్లలతో వచ్చారు. వీరిని ఆడించేందుకు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, వారి భర్తలు వచ్చారు. తల్లి పరీక్ష కేంద్రంలోకి వెళ్తే పిల్లలను ఆడిస్తూ ఉన్న సంఘటనలు దర్శనమిచ్చాయి.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, పోలీసు అధికారులు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రత్యేక పరిశీలకులుశ్రీధర్, యాదగిరి, శివారెడ్డితోపాటు రీజినల్ కోఆ ర్డినేటర్స్ సముద్రాల ఉపేందర్, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బి.నాగరాజు తనిఖీ చేశారు. మిర్యాలగూడ మండలంలో పరీక్ష కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ తనిఖీ చేశారు. సూర్యాపేట, చిలుకూరులో పరీక్షా కేంద్రాలను అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. సూర్యాపేటలో ఏఎస్పీ నాగేశ్వర్రావు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు.