రామగిరి/సూర్యాపేట, జూన్ 9 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా జరిగింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 47 సెంటర్లు ఏర్పాటు చేశారు. 16,899 మంది అభ్యర్థులకుగానూ 13,616 మంది హాజరయ్యారని, 3,283 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష తీరును అదనపు కలెక్టర్ పూర్ణచందర్, ఎస్పీ చందనాదీప్తి, అదనపు ఎస్పీ రాములునాయక్ వేర్వేరుగా పర్యవేక్షించారు. వీరితోపాటు జేఎన్టీయూ నుంచి పరీక్ష ప్రత్యేక పరిశీలకురాలు శైలజ, టీజీపీఎస్సీ నుంచి పరిశీలకుడు సతీశ్ తనిఖీలు చేశారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బి.నాగరాజు పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 32 సెంటర్లను ఏర్పాటు చేశారు. 9,725 మంది అభ్యర్థులకుగానూ 7,734 మంది హాజరుకాగా 1,991 మంది గైర్హాజరయ్యారు. 79.53 శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష పత్రాలను సెంటర్లకు తరలించారు. అదనపు కలెక్టర్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు పరీక్ష పత్రాల బండిల్స్‌ను అధికారులకు అందించారు.
ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు వేయడం ప్రారంభించారు. అంధులు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్ బీఎస్ లత పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
అభ్యర్థులతో సందడి గ్రూప్ -1 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులతో జిల్లా కేంద్రాలు సందడిగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి అభ్యర్థులకు ఇబ్బందులు కలుగడకుండా ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో నల్లగొండ కవులు, రచనలపై ప్రశ్న అడిగారు. 77వ ప్రశ్నగా ‘కింది వాటిలో సరైన జతను గుర్తించుము’ అని అడిగిన దానిలో నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, రచయిత పున్న అంజయ్య రాసిన నీలగిరి కవుల సంచికపై వచ్చింది. దాంతో మన జిల్లా కవులు, రచయితల ఖ్యాతి మరోమారు రుజువైంది.