యాదాద్రి భువనగిరి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో పాతాళగంగ అడుగంటుతున్నది. జిల్లాలో మార్చిలో సగటున 7.73మీటర్ల లోతున నీళ్లున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే 1.24మీటర్ల కిందకు నీటిమట్టం పడిపోయింది. దీంతో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఫలితంగా పొలాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో గత కొన్నేండ్లుగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. ఏటా గంగమ్మ ఉబికివచ్చింది. ఐదారు మీటర్ల దూరంలోనే నీటిమట్టం ఉండేది. కానీ గత కొంత కాలంగా వివిధ కారణాలతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. మార్చిలో జిల్లా సగటున 7.73మీటర్ల దూరంలో నీళ్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో 12.05 మీటర్ల మట్టంలో జలాలు ఉన్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో వానలు బాగానే కురిసినా.. రానురాను నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇక ఫిబ్రవరిలో 6.49 మీటర్ల దూరంలో నీళ్లున్న విషయం తెలిసిందే.
మండలాల్లో మరీ ఘోరం..
మండలాల వారీగా చూస్తే కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఘోరంగా పడిపోయాయి. అత్యధికంగా ఆత్మకూరు (ఎం) మండలంలో.. మండలంలో ఫిబ్రవరిలో 9.87 మీటర్లు ఉండగా మార్చిలో 11.72 మీటర్లకు పడిపోయాయి. ఇక బొమ్మల రామారంలో 11.21 మీటర్లు, సంస్థాన్ నారాయణపురంలో 10.36 మీటర్లు, రామన్నపేటలో 10.06 మీటర్లు, తుర్కపల్లిలో 9.20, మీటర్లు, రాజాపేటలో 8.70 మీటర్లు, బీబీనగర్‌లో 8.69 మీటర్లు, మోటకొండూరులో 8.09 మీటర్లు, యాదగిరిగుట్టలో 8.04 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. భూదాన్‌పోచంపల్లి మండలంలో కేవలం 3.16 మీటర్ల మట్టంలోనే నీళ్లు ఉబికివస్తున్నాయి. అడ్డగూడూరులో 3.71, వలిగొండలో 3.91 మీటర్లలో నీటి మట్టాలు ఉన్నాయి.
వట్టిపోయిన బోర్లు, బావులు..
భూగర్భ జలాలు ఇంకిపోతుడటంతో నీటి మట్టం తగ్గిపోతున్నది. దీంతో నీళ్లు లేక బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఇంతకాలం పుష్కలంగా నీళ్లు ఉండటంతో జోరుగా పోసిన బోర్లన్నీ ఎండిపోతున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని చోట్ల బోర్ల నుంచి నీళ్లు రావడం ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల నీళ్లు ఆగి ఆగి పోస్తుండగా, ఇంకొన్ని చోట్ల సన్నని ధారతో సరిపెడుతున్నాయి.
ట్యాంకర్లతో నీళ్లు..
జిల్లాలో నీళ్లు లేకపోవడంతో పంటలు ఆగమైతున్నాయి. పొట్ట దశకు వచ్చే సమయంలో సరిపడా నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక కొంత మంది రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరి, రాజాపేట, ఆత్మకూరు (ఎం), రామన్నపేట తదితర మండలాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు పెడుతున్నారు. నీళ్లు లేపోవడంతో పంట భూములన్నీ నెర్రెలు బారుతున్నాయి. పంట మొత్తం ఎండి గడ్డిలా మారుతున్నది. దీంతో గేదెలు, మేకలు, గొర్రెలను మేపుతున్న పరిస్థితి దాపురించింది.