యాదాద్రి భువనగిరి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కర్షకులకు పట్టించుకోవడమే మానేసి కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచుతున్నది. ఏడాది క్రితం నిండు కుండలా ఉన్న చెరువులు నేడు ఎడారిలా కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు సగం చెరువులు ఎండిపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు వేగంగా ఇంకిపోవడంతో బోర్లు, బావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి.
చెరువులపై నిర్లక్ష్యం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 733 చెరువుల్లో పూడిక తీశారు. మొదటి విడుతలో రూ.63 కోట్లతో 163 చెరువులు, రెండో విడుతలో రూ.76 కోట్లతో 203 చెరువులు, మూడో విడుతలో రూ. 70.78 కోట్లతో 240 చెరువులు, నాలుగో విడుతలో రూ. 25.90 కోట్లతో 127 చెరువులను పునరుద్ధరించారు. దాంతో మండుటెండల్లోనూ నిండు కుండల్లా కనిపించాయి. చెక్ డ్యామ్‌లు మత్తడి దుంకాయి. కానీ ఈసారి వేసవి రాక ముందే చెరువులు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వం పట్టింపులేమితో ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల కాళేశ్వరం జలాలతో గొలుసుకట్టు చెరువులను నింపే ప్రయత్నం చేసినా ఆశించిన స్థాయిలో చేపట్టకపోవడంతో ఫలితం దక్కలేదు.
ఎండిపోయే దశలో 412 చెరువులు
జిల్లాలో చిన్నవి, పెద్దవి కలుపుకొని 1165 చెరువులు ఉన్నాయి. ఇందులో వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 159, వందలోపు ఎకరాల విస్తీర్ణం గలవి 1,006 ఉన్నాయి. వాటిల్లో దాదాపు సగం ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారమే.. 412 చెరువుల్లో అస్సలు లేకపోవడం నుంచి 25 శాతం నీళ్లు మాత్రమే ఉన్నాయి. 227 చెరువుల్లో 25 నుంచి 50శాతం లోపు, 191 చెరువుల్లో 50 నుంచి 75శాతం, 250 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీళ్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 85 చోట్ల సర్ప్లస్ ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పుడే చెరువులు ఎండుపోతుంటే నడి వేసవిలో పరిస్థితి ఏంటని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు.. వట్టిపోతున్న బోర్లు
చెరువుల్లో నీళ్లు తగ్గిపోతున్నట్టే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఫిబ్రవరిలో సగటున 10.95 మీటర్ల లోతుకు వెళ్లాయి. గతంలో సగటున నాలుగైదు మీటర్ల లోతులోనే నీళ్లు ఉండగా, గతేడాది కంటే ఈసారి 2.36 మీటర్ల మేర అధికంగా పడిపోయాయి. జిల్లాలోని 17 మండలాల్లో భూగర్భ జలమట్టం తగ్గింది. సంస్థాన్ నారాయణపురం లో అత్యధికంగా 23.09 మీటర్ల దూరం లో నీళ్లు ఉన్నాయి. ఫలితంగా బోర్లు, బోరు బావు లు వట్టిపోయి పంటలు ఎడిపోతున్నాయి.
ఎండుతున్న పంటలు.
జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3.19లక్షల ఎకరాల్లో సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, రైతులు 2.80 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో అధిక శాతం వరి సాగు చేశారు. ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు ఎండల ప్రభావంతో కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో వరి కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొని తడులు అందిస్తున్నారు. ఇప్పటికే ఎండిన పంటలు పశువులకు మేతగా వినియోగిస్తున్నారు.
నెర్రెలు బారిన మేళ్లచెరువు
సంస్థాన్ నారాయణపురం : ఇది సంస్థాన్‌నారాయణపురం గుట్టల్లో ఉన్న మేళ్లచెరువు. సామర్థ్యం ఒక టీఎంసీ. మేళ్లచెరువు కింద 300 ఎకరాల ఆయకట్టు ఉంది. 30 కిలోమీటర్ల పరిధి వరకు బోర్లు పుష్కలంగా పోస్తాయి. అలాంటి చెరువు ఇప్పుడు నెర్రెలు వారి కనిపిస్తున్నది. 700 నుంచి వెయ్యి ఫీట్ల వరకు బోర్లు వేస్తున్న చుక్క నీరు పడడం లేదని సమీప రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి నుంచి రాచకొండలో లిఫ్ట్ ఏర్పాటు చేసి మేళ్లచెరువుతోపాటు స్థానిక చెరువులను నింపితే నారాయణపురం మండలం తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని స్థానికులు చెప్తున్నారు.
నీళ్లు లేక పూర్తిగా ఎండిన ఈ చెరువు
గుండాల : నీళ్లు లేక పూర్తిగా ఎండిన ఈ చెరువు గుండాల మండల కేంద్రంలోని రామసముద్రం. గతంలో నిండు కుండలా ఉన్న ఈ చెరువు ఇప్పుడు వెలవెలబోతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వల ద్వారా నాలుగు సార్లు రామసముద్రాన్ని నింపింది. దీని కింద వందెకరాలకుపైగా సాగయ్యేది. ఈ సీజన్లో చెరువు కింద వరి సాగు చేసిన రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు, బావులు సైతం వట్టిపోతుండడంతో పంటలు ఎండిపోతున్నాయి.
చెరువు నింపుతామంటే పంట వేశా..
మా ఊరి కొత్తచెరువును నింపుతామని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇస్తే బంగారం కుదువబెట్టి నాకున్న మూడెకరాల్లో వరి నాటు పెట్టిన. చెరువు నిండితే నీళ్లకు ఢోకా ఉండకపోయేది. కానీ, నీళ్లు ఇవ్వకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. ఎండిన పొలంలో ఆవులను మేపుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉన్నట్టే కనిపించడం లేదు.
-వాటికి యాదగిరి, రైతు, మాసాయిపేట (యాదగిరిగుట్ట మండలం)